వీర‌మ‌ల్లు వేష‌ధార‌ణ బంధిపోటును త‌ల‌పిస్తోందా?

Update: 2023-02-13 20:31 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` రిలీజ్ కి ఎప్పుడొస్తుందా? అంటూ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌తో వేచి చూస్తున్నారు. వీర‌మ‌ల్లు విరోచిత‌ పోరాటాలు సాహ‌స‌విన్యాసాలు ఏ రేంజులో ఉండ‌బోతున్నాయో చూడాల‌న్న ఉత్కంఠ అభిమానుల్లో అంత‌కంత‌కు పెరిగిపోతోంది. వీర‌మ‌ల్లు క‌థాంశం ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన హిస్టారిక‌ల్ ఫిక్షన్ కంటెంట్ లోనే ఎంతో యూనిక్ గా ఉంటుంది. ఔరంగ‌జేబ్ మొఘ‌లుల‌ సామ్రాజ్య నేప‌థ్యంలో బ్రిటీష్ రూలింగ్ క‌థాంశంతో నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే టాపిక్ ని ద‌ర్శ‌కుడు క్రిష్ ఎంపిక చేయ‌డంతో ఇప్ప‌టికే ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌చార‌ప‌రంగా హైప్ క‌నిపించ‌లేదు కానీ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్లో కొట్టేయాల‌ని క్రిష్ చాలా పెద్ద స్కెచ్ వేసార‌ని టాక్ ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు విడుద‌లైన అధికారిక పోస్ట‌ర్లు వీడియో కంటెంట్ ని బ‌ట్టి `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` లో భారీ యాక్ష‌న్ కి రొమాంటిక్ కంటెంట్ కి కొద‌వేమీ ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ క‌థాంశం ప్ర‌కారం రాజ‌రికం.. భార‌త‌దేశంపై విదేశీయుల‌ దాడులు.. కోహినూర్ వ‌జ్రం నెమ‌లి సింహాస‌నం దోపిడీ వంటి అంశాల‌తో ముడిప‌డిన స‌న్నివేశాల్లో వీర‌మ‌ల్లు విరోచిత పోరాటాలు మ‌రో లెవ‌ల్లో ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆన్ లొకేష‌న్ స్టిల్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇది త్రోబ్యాక్ ఫోటోనే అయినా కానీ ప‌రిశీలన‌గా చూస్తే ఇందులో ప‌వన్ గెట‌ప్ విశ్లేష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది.  ఎర్ర‌టి జుబ్బా.. న‌ల్ల‌ని పంచె క‌ట్టు దానికి కాంబినేష‌న్ గా బ్లాక్ లెద‌ర్ చెప్పులు ధ‌రించి క‌నిపిస్తున్నాడు వీర‌మ‌ల్లు. ఆన్ లొకేష‌న్ రిలాక్స్ డ్ గా ఉన్న‌ప్ప‌టి లుక్ ఇది.

గుబురు గ‌డ్డం ప‌క్క పాపిడి.. చేతికి క‌డియంతో స్మైలిస్తూ ప‌వ‌న్ క‌నిపించిన తీరు చూస్తుంటే అత‌డి వేష‌ధార‌ణ వంద‌శాతం జాన‌ప‌దుల‌కు స‌రిపోతుందా? అనే సందేహం క‌ల‌గ‌క మాన‌దు. నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం గుణ‌శేఖ‌ర్ రుద్ర‌మ‌దేవి సినిమాలో రెగ్యుల‌ర్ హెయిర్ స్టైల్ తోనే క‌నిపించాడు. బంధిపోటు గ‌న్నారెడ్డిగా న‌టించినా అత‌డేమీ చంద‌మామ క‌థ‌ల పుస్త‌కంలో బంధిపోటులా జుల‌పాల జుత్తు లేదా పొడ‌వాటి గిర‌జాల జుత్తుతో క‌నిపించ‌లేదు. స్లిమ్ గా ప‌క్క పాపిడి తీసుకుని క‌ళియుగ గ‌న్నారెడ్డినే త‌ల‌పించాడు కానీ జాన‌ప‌దుల గ‌న్నారెడ్డిలా క‌నిపించ‌డు. అయితే గుణ‌శేఖ‌ర్ అత‌డి పాత్ర‌ను భారీ యాక్ష‌న్ తో మ‌లిచిన తీరును బ‌ట్టి బ‌న్ని హెయిర్ స్టైల్ గురించి ఆడియెన్ అంత‌గా ప‌ట్టించుకోరు.

ఇప్పుడు కూడా వీర‌మ‌ల్లు చిత్రంలో అదే పంథా మాయాజాలం ప‌ని చేస్తుంద‌ని భావించ‌వ‌చ్చు. నిజానికి చంద‌మామ - బుజ్జాయి- బొమ్మ‌రిల్లు- బాల‌మిత్ర క‌థ‌ల పుస్త‌కాలు చ‌దివిన నాటి త‌రం ఒక బంధిపోటును ఇలాంటి రూపంతో ఊహించుకోవ‌డం చాలా క‌ష్టం. నేటిత‌రానికి అలాంటి పాత క‌థ‌ల పుస్త‌కాలు చ‌దివే అల‌వాటు లేదు కాబ‌ట్టి వీళ్ల‌ను తెర‌పై అలా చూపించి క‌న్విన్స్ చేయ‌డం సులువు అవుతుందేమో కానీ చంద‌మామ క‌థ‌లు చ‌దివిన 80లు 90ల బ్యాచ్ ల‌ను సంతుష్ఠుల‌ను చేసే వేష‌ధార‌ణ ఇది కానే కాదని విశ్లేషించ‌వ‌చ్చు. ఇక వీర‌మ‌ల్లు పాత్ర‌ధారి లెద‌ర్ చెప్పులు తొడుక్కున్నా కానీ అవి చాలా మోడ్ర‌నైజ్డ్ గా ఉన్నాయి.

ప‌వ‌న్ లుక్ మ‌రీ భీక‌రంగా పెంచిన గిర‌జాల జుత్తుతో రాజులానో లేక వికార‌మైన బంధిపోటుగానో క‌నిపించ‌డం లేదు. వీర‌మ‌ల్లు పాత్ర లుక్ ని డిజైన్ చేసిన తీరు నిజంగా సినిమా రిలీజ్ అనంత‌రం చ‌ర్చ‌కు రావ‌డం ఖాయం. నాటి జాన‌ప‌దుల‌ను త‌ల‌పించేలా విలేజీలు నిర్మించి సినిమా తీసినా కానీ అక్క‌డ క‌నిపించే పాత్ర‌లు జాన‌ప‌దుల వ‌స్త్ర‌ధార‌ణ యాంబియెన్స్ తో క‌నిపించేలా చేయ‌డంలోనే క్రిష్ నేర్ప‌రిత‌నం కీల‌కంగా భావించాలి. అత‌డు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో బాల‌కృష్ణ‌ను మ‌హారాజుగా ఆవిష్క‌రించిన తీరు అమోఘం. రాజు వేష‌ధార‌ణ ఆహార్యానికి బాల‌య్య స‌రిపోయారు. అందుకే ఆ సినిమా చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించ‌గ‌లిగింది. ఇక ట్రాయ్ - గ్లాడియేట‌ర్- 300 లాంటి హాలీవుడ్ జాన‌ప‌ద వారియ‌ర్ నేప‌థ్య‌ సినిమాలు వీక్షించిన క‌ళ్ల‌కు కూడా వీర‌మ‌ల్లు గెట‌ప్ చాలా రెగ్యుల‌ర్ గా క‌నిపిస్తుందే కానీ కొత్త‌గా లేదా వింత‌గా అనిపించ‌దు. అయితే బంధిపోటు రూపం ఫ‌లానా విధంగా ఉంటుంది అని ఎవ‌రికి వారు డెఫినిష‌న్ ఇచ్చుకుంటే వారి వారి కోణాల‌ను బ‌ట్టి ప‌వ‌న్ రూపాన్ని చూడ‌గ‌ల‌రు. ఇది ర‌చ‌యిత అభిప్రాయం మాత్ర‌మే. ఇత‌రుల‌ను కించ‌ప‌రిచే ఉద్ధేశం కాద‌ని గ‌మ‌నించాలి. ఈ అభిప్రాయంతో ఇత‌రులు అంగీక‌రించాల‌నే రూల్ కూడా ఏం లేదు!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News