పవన్.. ఫ్యాన్స్ కోరికను మన్నిస్తారా..?

Update: 2022-02-24 05:25 GMT
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్‌' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రేపు (ఫిబ్రవరి 25) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడంతో పాటుగా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యపనుం కోషియం' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్‌ గా రూపొందింది.

రీమేక్ అయినప్పటికీ పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్‌ లో త్రివిక్రమ్ చాలా మార్పులు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే మల్టీస్టారర్ ను సోలో హీరో మూవీగా మార్చేశారనే అనుకోవాలి. ఇటీవల వచ్చిన ట్రైలర్ లో సౌండ్ మిక్సింగ్ సరిగా లేకపోవడంతో ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ నిన్న వదిలిన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

'భీమ్లా నాయక్‌' సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇకపై రీమేక్ సినిమాలను చేయకూడదని ఓ వర్గం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మనం నిశితంగా గమనిస్తే, పవన్ కెరీర్ లో అనేక రీమేక్ చిత్రాలు ఉన్నాయి. స్టార్ హీరో మొదటి నుంచీ కూడా ఇతర భాషల్లో హిట్టైన కంటెంట్ ను తెలుగులోకి తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైంది రీమేక్ తోనే అనే సంగతి తెలిసిందే. 'ఖయామత్ సే ఖయామత్ తక్' అనే హిందీ చిత్రానికి అధికారిక రీమేక్ గా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తెరకెక్కింది. రెండో సినిమా 'గోకులంలో సీత'.. 'గోకులతిల్ సీతై' అనే తమిళ్ మూవీకి రీమేక్. 'లవ్ టుడే' అనే తమిళ చిత్రానికి రీమేక్ గా అతని మూడో సినిమా 'సుస్వాగతం' రూపొందింది.

'జో జీతా వోహీ సికందర్' అనే హిందీ సినిమా ఆధారంగా 'తమ్ముడు' సినిమా రూపొందించబడింది. ఇదే క్రమంలో 'ఖుషీ' చిత్రాన్ని రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్.. 'తిరుపాచి' చిత్రానికి 'అన్నవరం' సినిమా చేసారు. అలానే 'తీన్ మార్' (లవ్ ఆజ్ కల్) - 'గబ్బర్ సింగ్' (దబాంగ్) - 'గోపాలా గోపాలా' (ఓ మై గాడ్) - 'కాటమరాయుడు' (వీరమ్) వంటి రీమేక్ సినిమాలు పవన్ ఖాతాలో ఉన్నాయి.

ఇక 'అజ్ఞాతవాసి' సినిమా 'లార్గో విచ్' అనే ఫ్రెంచ్ చిత్రానికి అనధికారిక రీమేక్ అనే అనుకోవాలి. పవర్ స్టార్ సినిమాల నుంచి కాస్త విరామం తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన 'వకీల్ సాబ్' మూవీ హిందీలో ఘనవిజయం సాధించిన 'పింక్‌' కి అధికారిక రీమేక్ అనే సంగతి విదితమే. ఇప్పుడు 'భీమ్లా నాయక్' తో మరో ఇతర భాషలో హిట్టైన కంటెంట్ తో రాబోతున్నారు. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే టాలీవుడ్ లో అత్యధిక రీమేక్ సినిమాలు చేసిన హీరో పవన్ అనే చెప్పాలి.

ఆల్రెడీ ఒక భాషలో హిట్ అయిన కథ కాబట్టి రిస్క్ ఉండదు అనుకుంటారో.. అలాంటి కంటెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో రీమేక్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటారో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో సంతోషంగా లేరనే కామెంట్స్ వస్తున్నాయి. అందుకే ఇప్పటి నుంచి వాటి జోలికి వెళ్లకుండా ఒరిజినల్ స్టోరీలతో బ్లాక్ బస్టర్స్ కొట్టాలని కోరుకుంటున్నారు.

కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పటికే 'వినోద‌య సీత‌మ్‌' అనే తమిళ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి తేజ్ తో స్క్రీన్ చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండడంతో తన సన్నిహితుడు త్రివిక్రమ్‌ కి ప్రాజెక్ట్‌ లను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించాడని టాక్ ఉంది. పవన్ బిజీ షెడ్యూల్స్ ని దృష్టిలో పెట్టుకొని.. అనతికాలంలోనే ముగించవచ్చనే ఉద్దేశ్యంతో స్టార్ డైరెక్టర్ రీమేక్‌ లను సజెస్ట్ చేస్తున్నాడేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' వంటి ఒరిజినల్ సినిమాలోనూ నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీ తర్వాత 'భవదీయుడు భగత్ సింగ్' వంటి మరో మూవీని సెట్స్ మీదకు తీసుకురానున్నారు. ఇదే క్రమంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.

Tags:    

Similar News