పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ కొనసాగుతున్నాడు కాబట్టి ఆయన తెరపై ఏం మాట్లాడినా అది పొలిటికల్ గా రిలేట్ అయ్యే అవకాశముంంటుంది. అలాంటిది ఆయన ఏకంగా పాలిటిక్స్ నే దృష్టిలో ఉంచుకొనే డైలాగులు రాయిస్తే? ఇక తిరుగేముంటుంది! ఆ డైలాగులు పేలిపోతాయి. అభిమానులు పండగ చేసుకొంటారు. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో అదే జరిగింది. పొలిటికల్ పంచులేమైనా ఉంటాయా అని దర్శకుడు బాబీని అడిగితే... స్టోరీలో ఒకట్రెండు ఏమైనా రిలేట్ అవ్వొచ్చు అన్నాడు. అయితే సినిమాలో మాత్రం ఆయన చెప్పినట్టు ఒకట్రెండు మాత్రమే కాదు.. బోలెడన్ని పంచులు పేలాయి. కాపులకి సంబంధించి కూడా ఓ డైలాగ్ ఉంది. కాపు కాసినప్పుడు గుర్తుకు రాని నా కులం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ అంటాడు. అది థియేటర్లో మామూలుగా పేలలేదు. అభిమానులైతే అదరహో అంటున్నారు. అలాగే నా అవసరం ఉందంటే పిలవకపోయినా వస్తాను అని మరో డైలాగ్ చెప్పాడు. ఇక జనంతో వస్తా, జనంలా ఉంటా అంటూ ట్రైలర్ లో డైలాగ్ ఉండనే ఉంది. నిజానికి సినిమాలో పవన్ వాడిన ప్రతి డైలాగ్ కూడా పాలిటిక్స్ కి రిలేట్ అవుతుంటుంది. ఇక పాలిటిక్స్ ని దృష్టిలో ఉంచుకొనే రాయించిన డైలాగులయితే పీక్స్ లో పేలాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రివ్యూ రిపోర్టులనిబట్టి సినిమా పవన్ వన్‌మేన్ షో అని తేలిపోయింది. అభిమానులైతే ఖుషీఖుషీగా ఉన్నారు. వేల రూపాయలు పెట్టి టిక్కెట్టు కొని ప్రివ్యూ చూసిన అభిమానులు అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందని, హ్యాపీ అని అంటున్నారు. మరి కామన్ ఆడియెన్స్ రిపోర్ట్ ఏంటన్నది తెలియాలంటే మాత్రం మరికొంతకాలం ఆగాల్సిందే.