కామెంట్: మేకర్స్ కంటే పైరేట్స్ కే ప్రాఫిట్

Update: 2016-08-23 01:30 GMT
సైజులో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇక్కడ ఏటా వెయ్యికి పైగా సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఇవన్నీ కలిపి.. 2 బిలియన్ డాలర్లు.. అంటే 13వేల 800 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేస్తుంటాయి. ఈ అంకెలు చూసి అమ్మో అనుకోవాల్సిన పనేం లేదు. ఎందుకంటే.. ఈ సినిమాలను పైరసీ చేయడం ద్వారా 18 వేల కోట్ల రూపాయలు(2.7బి. డాలర్లు) ఆర్జిస్తున్నారు పైరేట్స్(పైరసీ చేసేవాళ్లను దొంగలు అనచ్చు.. తప్పేం లేదు.)

గతేడాది రిలీజ్ అయిన షారూక్ ఖాన్ మూవీకి 148 కోట్ల థియేట్రికల్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ కంటే ఒక రోజు ముందే బయటకొచ్చి పైరసీ సీడీల కారణంగా.. ఈ మొత్తం కంటే ఎక్కువగా పైరసీదారులు లాభం పొందారు. ఈ ఏడాది రిలీజ్ అయిన వాటిలో ఉడ్తా పంజాబ్.. గ్రేట్ గ్రాండ్ మస్తీ.. కబాలిల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ అంకెలేమీ కాకి లెక్కలు కాదు. ప్రపంచ మేథో  హక్కుల సంస్థ(WIPO) అధికారికంగా ప్రకటించిన ఫిగర్ ఇది.

చాలా వరకు పైరసీ థియేటర్ల నుంచి కామ్ కార్డర్లతో రికార్డ్ చేయడం ద్వారానే జరుగుతోంది. 2020 నాటికి మన సినిమా పరిశ్రమ 28వేల కోట్ల రూపాయల స్థాయికి ఎదుగుతుందనే అంచనాలున్నాయి. ఈ వృద్ధి రేటు మరింతగా పెరిగేందుకు.. ఇప్పుడు పైరసీపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. కానీ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందకపోతే మాత్రం.. ఈ లక్ష్యాన్ని అందుకోవడం కష్టమని వాపోతున్నారు. మరి ఇంతటి పరిశ్రమను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా?
Tags:    

Similar News