'ల‌క్ష్మీస్‌' కు ఆదిలోనే దెబ్బ ప‌డిపోయిందే!

Update: 2017-11-12 09:45 GMT
తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా  ప‌నిచేసి సంక్షేమ ప‌థ‌కాల‌కు కొత్త అర్థం చెప్పిన మ‌హానీయుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత క‌థ ఆధారంగా తెక‌కెక్కుతున్న చ‌ల‌న చిత్రాల‌పై ఇప్పుడు తెలుగు నాట పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర అన‌గానే... ప్రస్తుతం టీడీపీ అధినేత‌గానే కాకుండా ఏపీ సీఎంగా ఉన్న నారా చంద్ర‌బాబునాయుడు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తారు. ఎందుకంటే... ఎన్టీఆర్ బ‌తికుండ‌గా, ఆయ‌న‌కు వెన్నంటే ఉన్న చంద్ర‌బాబు... ఆ త‌ర్వాత బ‌ల‌వంతంగా ఎన్టీఆర్ చేతుల్లో నుంచి పార్టీని, అధికారాన్ని లాగేసుకున్నారు. ఈ లాగేసుకోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టేవాళ్లు మెజారిటీ వ‌ర్గంగా ఉంటే... పార్టీని కాపాడుకునేందుకే అలా చేయాల్సి వ‌చ్చింద‌న్న వాద‌న వినిపించే వాళ్లు కూడా లేక‌పోలేదు.

అయితే ఎవ‌రి వాద‌న‌లు వారికి ఉండ‌వ‌చ్చు గానీ... ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రాల విష‌యంలోకి వ‌స్తే... తొలుత ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఈ ప్ర‌స్తావ‌న తెచ్చారు. ఇక ఆ త‌ర్వాత రంగంలోకి దిగిన బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ కూడా తానూ ఓ చిత్రాన్ని తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత చెన్నైలో తెలుగు భాష‌, తెలుగు వారి హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం పోరాడుతున్న తెలుగు నేత కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి తానూ ఓ చిత్రాన్ని తీస్తున్నట్లు ప్ర‌క‌టించారు. బాల‌య్య ప్ర‌క‌టించిన చిత్రం పేరు ఇప్ప‌టిదాకా బ‌ట‌య‌కు రాక‌పోగా... వ‌ర్మ చిత్రానికి *ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌* అని, కేతిరెడ్డి చిత్రానికి *ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం* అనే పేర్లు ఖ‌రారైపోయాయి. తొలి ఇద్ద‌రు కాస్తంత నెమ్మ‌దిగా వెళుతుండ‌గా, కేతిరెడ్డి మాత్రం స్పీడు పెంచేశారు.

మొన్న‌టిదాకా గుంటూరు జిల్లా ప‌రిధిలోని ల‌క్ష్మీపార్వ‌తి స్వ‌గ్రామం ప‌రిస‌రాల‌ను చుట్టేసి పెను క‌ల‌క‌లం రేపిన కేతిరెడ్డి.. తాజాగా హైద‌రాబాదులో అడుగుపెట్టేశారు. తాను తీయ‌బోయే ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ఆయ‌న హైద‌రాబాదులో ఉన్న ఎన్టీఆర్ స‌మాధి ప్రాంతం ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ముహూర్త‌పు షాట్ కు కాస్తంత ముందుగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు షూటింగ్‌కు అనుమ‌తి లేదంటూ అడ్డుకున్నారు. అయితే తాను అనుమ‌తి తీసుకున్నాన‌ని చెబుతూ కేతిరెడ్డి చూపిన ప‌త్రాల‌ను ప‌రిశీలించిన పోలీసులు.. అందులో వివ‌రాలేమీ లేవ‌ని తిరస్క‌రించేశారు. దీంతో చిర్రెత్తిపోయిన కేతిరెడ్డి... పోలీసుల తీరుపైనే కాకుండా ల‌క్ష్మీపార్వ‌తి పైనా త‌న‌దైన శైలిలో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఎన్టీఆర్ ఆత్మప్రబోధం మేరకు సినిమా తీసున్నామని ఆయ‌న అన్నారు. తమ సినిమాకు లక్ష్మీ పార్వతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సూచించారు. లేని పక్షంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి, ఆమె నిజస్వరూపం బయటపెడతామని హెచ్చరించారు. తానేమీ లక్ష్మీ పార్వతి బయోపిక్ తీస్తానని ఎక్కడా చెప్పలేదని, దానిపై లక్ష్మీ పార్వతికి అభ్యంతరం ఏమిటని ప్ర‌శ్నించారు. తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను చంద్రబాబు కోణంలోంచి తీస్తున్నానని ఆయన చెప్పారు. తన సినిమా పూర్తయిన తరువాత, అది చూసిన తరువాత లక్ష్మీ పార్వతికి ఏవైన అభ్యంతరాలు ఉంటే కోర్టులో చూసుకోవాలని సూచించారు. తాను కూడా కోర్టులేనే తేల్చుకుంటానని ఆయన తెలిపారు.
Tags:    

Similar News