'నగుమోము తారలే'.. 'రాధే శ్యామ్' నుంచి అందమైన ప్రేమగీతం..!

Update: 2021-12-02 06:39 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ డ్రామా ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే నాలుగు భాషల్లో రిలీజ్ చేయబడిన 'ఈ రాతలే' పాట ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ క్రమంలో 'నగుమోము తారలే' అనే సెకండ్ సింగిల్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

'వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్' పేరుతో 'రాధే శ్యామ్' హిందీ వెర్సన్ నుంచి బుధవారం విడుదలైన 'ఆషికీ ఆ గయీ' సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ''నగుమోము తారలే'' అనే గీతాన్ని రిలీజ్ చేశారు. నేను రోమియోని కాదని ప్రభాస్ చెప్పగా.. 'కానీ నేను జూలియట్ ని.. నాతో ప్రేమలో పడితే చస్తావ్' అని పూజా అనడంతో ఈ పాట ప్రారంభమవుంటుంది.

'నగుమోము తారలే.. తేగిరాలే నేలకే.. ఒకటైతే మీరిలా.. చూడాలనే.. సగమాయే ప్రాయమే.. కదిలేను పాదమే.. పడసాగే ప్రాణమే.. తన వెనకే' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. విక్రమాదిత్య - ప్రేరణ లుగా కనిపించనున్న ప్రభాస్ - పూజా హెగ్డేల మధ్య ప్రేమ గాఢతను ఈ పాట తెలియజేస్తోంది. పూజా కోసం వర్షంలో తడుస్తూ ఎదురుచూస్తున్న ప్రభాస్.. ఆమెను బైక్ మీద తీసుకెళ్లి వివిధ ప్రదేశాలను చుట్టేయడం అందమైన అనుభూతిని కలిగిస్తోంది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుడిరినట్లు అర్థం అవుతోంది.

జస్టిన్ ప్రభాకరన్ ఈ మెలోడీకి స్వరాలు సమకూర్చారు. మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తనదైన వాయిస్ తో మరోసారి మ్యాజిక్ చేశారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్‌ కన్నన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ 'నగుమోము తారలే' పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తూ.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.

'రాధే శ్యామ్' చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ - గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ పాటుగా పలు విదేశీ భాషల్లో 2022 జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.


Full View
Tags:    

Similar News