'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' 3వ దశకు శ్రీకారం చుట్టిన ప్రభాస్...!

Update: 2020-06-11 15:30 GMT
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' విస్తృతంగా నడుస్తోంది. 'పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే' అనే నినాదంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. 'గ్రీన్ ఛాలెంజ్' పేరుతో చెట్లను నాటడంతో పాటు ఇతరులను నామినేట్ చేస్తూ వారితో నాటించే కార్యక్రమం విస్తృతంగా నడుస్తోంది. ప్రభుత్వాలు అటవీ సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న ఈ ఛాలెంజ్ లో సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు మరియు సామాన్య ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతూ వస్తున్నారు. మొదట ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటి ఆ ఛాలెంజ్ విసరడంతో ఆ తర్వాత హీరో అఖిల్ అక్కినేని, ఎంపీ కవిత మొక్కలు నాటారు. ఆ తర్వాత గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన అక్కినేని నాగార్జున, అనిల్ కుమార్ యాదవ్, రోజా, అర్జున్, కేటీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, సచిన్, లక్ష్మణ్, సైనా నెహ్వాల్, గోపిచంద్ వంటి ప్రముఖులంతా భాగస్వాములవుతూ మొక్కలు నాటారు.

ఇదిలా ఉండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' మూడవ విడతలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తో కలసి మొక్కలను నాటాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు మొక్కలు నాటి మూడవ దశ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమం నన్ను ఇన్ స్పైర్ చేసింది. వారి స్పూర్తితో వారు ఎక్కడ సూచిస్తే అక్కడ వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటాను. సంతోష్ కుమార్ గారి మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే.. మనమంతా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజం బావుంటుందని నా అభిప్రాయం. ఈ కార్యక్రమం కొనసాగింపుగా రామ్ చరణ్, దగ్గుబాటి రానా, శ్రద్ధా కపూర్‌ లను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కు నామినేట్ చేస్తున్నాను'' అని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభాస్ గారిది మంచి మనసు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప హీరో. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్పూర్తిదాయకం. ప్రభాస్ కి కోట్లాదిగా ఉన్న వారి ఫ్యాన్స్ అంతా ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి నేలతల్లికి పచ్చని పందిరివేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ప్రభాస్ చాలా రోజుల తరువాత కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Tags:    

Similar News