అయోమయం స్థితిలో ఉన్న అనుష్క సినిమాకి ప్రభాస్ అండగా నిలిచినట్టు తెలుస్తోంది. ఎన్ని ఇబ్బందులెదురైనా ఆ సినిమా పట్టాలెక్కాల్సిందే అని ప్రభాస్ చెప్పినట్టు సమాచారం. దీంతో అనుష్క సినిమాకి అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే అని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే... అనుష్కతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలని పిల్ల జమిందార్ దర్శకుడు అశోక్... `భాగ్ మతి` పేరుతో ఓ స్ర్కిప్టు పట్టుకొని రెండేళ్లుగా తిరుగుతున్నాడు. ఆ కథ అనుష్కకీ నచ్చింది. ప్రభాస్ స్నేహితులైన యువి క్రియేషన్స్ వంశీ - ప్రమోద్ లు ఆ సినిమాని నిర్మించడానికి కూడా ముందుకొచ్చారు. బాహుబలి 2 పూర్తయిన వెంటనే... ఈ సినిమా పట్టాలెక్కుతుందని అందరూ ఊహించారు. అయితే అనుష్క నటించిన సైజ్ జీరో బోల్తా కొట్టడంతో భాగ్ మతి సంధిగ్ధంలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ తో సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందా అని నిర్మాతలు ఆలోచనలో పడిపోయారట. ఇదే డౌట్ ప్రభాస్ ముందు వుంచారట. కానీ ఆయన మాత్రం కథ బాగుంది కాబట్టి, ఆ సినిమాని మొదలుపెట్టండని సలహా ఇచ్చినట్టు తెలిసింది. యువీ క్రియేషన్స్ అంటే.. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థతో సమానం. ప్రభాస్ ఏం చెబితే అది యువీ అధినేతలు తప్పకుండా వింటారు. బడ్జెట్ విషయం ప్రభాస్ దగ్గర ప్రస్తావించినప్పుడు అవసరమైతే ఆ సినిమాలో నేను కూడా కీలక పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చాడట. ప్రభాస్ అంత సాయం చేస్తే గనక సినిమాకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారం పరంగా యమా క్రేజీ ఏర్పడుతుంది. ప్రభాస్ ఐడియా నిజంగా సూపర్బ్ కదా! మరి ఇదంతా నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!!