లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డా: ప్రభాస్

Update: 2022-03-05 09:47 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ - పూజాహెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ''రాధేశ్యామ్'' రిలీజ్ కు రెడీ అయింది. డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ పీరియాడికల్ లవ్ డ్రామా.. ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్‌ పెంచారు.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న 'రాధేశ్యామ్' కోసం ప్రభాస్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పలు ఆస్తక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రొమాంటిక్ సీన్స్ లో నటించడం గురించి స్పందించారు.

తనకు ముందు నుంచి ముద్దు సీన్స్‌ అంటే చాలా సిగ్గు అని.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇప్పటికీ ఇబ్బందిగానే ఫీల్ అవుతానని ప్రభాస్ అన్నారు. కానీ 'రాధే శ్యామ్‌' లవ్ సినిమా కావడంతో.. కథ డిమాండ్‌ మేరకు అలాంటి సీన్స్ చేయక తప్పలేదని డార్లింగ్ తెలిపారు.

''గతంలో యాక్షన్ సినిమాలతో పాటు మాస్ ఎక్కువగా చేయడంతో కిస్సింగ్ సీన్ల నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ 'రాధే శ్యామ్' అనేది పూర్తిగా ప్రేమకథ. కమర్షియల్ సినిమాల్లో అలాంటి సీన్స్ ను అవైడ్ చేయొచ్చు కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ లో పక్కన పెట్టలేం'' అని ప్రభాస్ అన్నారు.

''పూజా హెగ్డేతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాను. అలాంటి సీన్స్ చేయాలన్నప్పుడు సెట్ లో ఎవరు లేకుండా ఒక ప్రైవేట్ స్పేస్ లో చేస్తానని చెప్పాను. అందుకు దర్శకుడు ఓకే చెప్పగానే ఓ రహస్య ప్రదేశంలో ముద్దు సీన్స్‌ కానిచ్చేశాను. అంతేకాదు షర్ట్‌ లేకుండా కొంతమంది ముందు నటించడం కూడా నా వల్ల కాలేదు'' అని ప్రభాస్‌ చెప్పుకొచ్చారు.

కాగా, 1970స్ యూరఫ్ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ లవ్ డ్రామాగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ''రాధేశ్యామ్'' చిత్రాన్ని తెరకెక్కించారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. వంశీ - ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.

జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేశారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్‌.రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్ మరియు జపనీస్ భాషల్లో 'రాధేశ్యామ్' మూవీ విడుదల కానుంది.
Tags:    

Similar News