120 రూపాయలతో వచ్చా-ప్రకాష్ రాజ్

Update: 2016-10-02 13:30 GMT
ఊరు మీకెంతో ఇచ్చింది.. తిరిగిచ్చేయండీ అంటాడు ‘శ్రీమంతుడు’. ఎదిగేకొద్దీ బరువులు పెరిగిపోతాయి.. ఆ బరువులు తగ్గించుకుని తేలిగ్గా మారితే బెటర్ అంటున్నాడు ప్రకాష్ రాజ్. మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకుని అక్కడ దగ్గరుండి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాష్ రాజ్. ఐతే తాను ఏదో సినిమా చూసి ఇదంతా చేయట్లేదని.. తనకు తానుగా స్పందించి ఈ పని చేస్తున్నానని ప్రకాష్ రాజ్ తెలిపాడు.

‘‘నేనేమీ సినిమా చూసి ఇదంతా చేయట్లేదు. నాకు మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో పొలం ఉంది. నేనక్కడికి వెళ్తున్నపుడు ఆ ఊరి పరిస్థితి గమనించాను. చదువుకోవాల్సిన పిల్లలు ఆడుకుంటున్నారు. అరే.. నా కూతురు లండన్‌లో చదువుకుంటోంది.. తన ఏడాది ఫీజుతో ఇక్కడ వందమంది చదువుతారే అనిపించింది. ఐతే ఊరిని దత్తత తీసుకుని, వాళ్లకు అన్నం పెట్టగానే సరిపోదు. సమస్యలు తెలుసుకోవాలి. తీర్చాలి. ఊరి జనం తమ కాళ్లపై నిలబడేలా చేయూతనివ్వాలి.

ఊరిని దత్తత తీసుకోడానికి డబ్బు కన్నా మనసు.. సమయం.. కమిట్‌మెంట్ అవసరం. ఏ మనిషీ తన వల్లే పెరగడు. పదిమంది తనకిచ్చిన దాని వల్లే పెరుగుతాడు. నేను 120 రూపాయలతో నటుణ్ణి కావాలని వస్తే నాకు ఇవాళ అందరి వల్లా ఇంత గుర్తింపు వచ్చింది. తిండికి కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి సమాజానికి కొంతైనా తిరిగివ్వాలి. వెలగడం గొప్ప కాదు. వెలిగించడం గొప్ప. ఎదిగేకొద్దీ అన్ని రకాల బరువూ తగ్గించుకొని తేలిగ్గా మారితే బెటర్. ఆఖరికి పోయాక ఓ నలుగురు మనల్ని మోయాలిగా’’ అంటూ తనదైన శైలిలో చెప్పాడు ప్రకాష్ రాజ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News