గెలిచింది విష్ణు .. మాట్లాడుతున్నది మోహన్ బాబు: ప్రకాశ్ రాజ్

Update: 2021-10-19 02:53 GMT
'మా' ఎలక్షన్స్ ఈ సారి మాటలతోనే మహాసంగ్రామాన్ని తలపించాయి. ఎవరూ ఎలాంటి ఆరోపణలు చేయడానికి తగ్గలేదు. ఆ తరువాత తమని తాము సవరించుకుని కూల్ కాలేదు. చివరివరకూ ఆ వాడి .. వేడితోనే కొనసాగాయి. ఫలితాలు వెల్లడించిన తరువాత అంతా సర్దుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ఎవరికి అవకాశం వస్తే వారు చెలరేగిపోతూనే ఉన్నారు. పంచ్ లు .. సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమానికి వచ్చిన ప్రకాశ్ రాజ్, ఆ ఎన్నికలపై తన మనసులోని మాటల మూటను విప్పారు.

"కొంతమంది మన కుటుంబం .. మన కుటుంబం అంటున్నారు .. అదంతా అబద్ధం. అలా అనేవాళ్ల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. నుంచున్న వాళ్ల మధ్య పోటీ ఉండదు .. వీడి వెనక ఎవరున్నారో .. వాడి వెనక ఎవరున్నారో వాళ్లు వదలరు. అసలువాళ్లు పరోక్షంగా వేరే రూపాల్లో వస్తుంటారు. అలా అసలు వాళ్ల మధ్య జరిగిన యుద్ధంలో నేను ఒక పావును అయ్యానని అంతా అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే అందరి పెద్దరికాలను నేను ప్రశ్నిస్తూ ఉండటమే అందుకు నిదర్శనం.

సినిమా ఇండస్ట్రీ కొంతమంది చెబుతున్నట్టుగా ఒకటైతే కాదు .. ఇక్కడ ఎవరి ఈగోలు వారికి ఉన్నాయి. నా వెనక ఎవరో ఉన్నారని అంటారు. నేను అంటే నచ్చిన వాళ్లంతా నా వెనక ఉన్నట్టా? నన్ను పోటీకి నిలబెట్టాలని ఎవరు నిర్ణయించారని అంటారు. నన్ను నిర్ణయించేవారు ఎవరండీ ఈ దేశంలో. నా వెనక చిరంజీవిగారు ఉన్నారని విష్ణు చెప్పినా .. మోహన్ బాబు గారు చెప్పినా అది అబద్ధం ఎందుకు అయ్యుండకూడదు? 'మా'లో ఈగోవార్ జరుగుతుందనే విషయాన్ని నేను గమనించే ఈ సారి నేను నుంచోవాలని పోయినసారే నిర్ణయించుకున్నాను. మూలాలలోకి వెళ్లి పరిశీలిస్తే, ఇప్పటివరకూ ఉన్నవారికి అవగాహనే లేదనే విషయం నాకు అర్థమైంది.

కుటుంబం .. కుటుంబం అంటారు .. దాదాపు 50 శాతం మంది ఓటింగుకు రారు. అలాంటప్పుడు అది కుటుంబం ఎలా అవుతుంది? అనే విషయం నాకు అర్థం కాలేదు. ఎప్పుడైనా గెలిచినవారు తమని గెలిపించినవారిని గురించి ఆలోచించారా? ఓటేసిన తరువాత ఇక్కడ ఎవరి కష్టాలు వాళ్లే పడాలి. 'మా' అసోసియేషన్ మసకబారింది అంటారు. కింద ఉన్న 900 మంది వలన కాదు, ఆ పైనున్నపాతిక మంది వల్లనే ఇలా అయింది. సమస్యలు పట్టించుకోకపోతే పరిష్కారమవుతాయా? నా వలన ఇబ్బంది అవుతుందనే ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చారు.

నేను నిజాయితీగా గెలవాలని అనుకున్నాను .. అలాగే ముందుకు వెళ్లాను. నేను ఓట్లను గుద్దించుకోలేదు .. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల విషయంలో మోసాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను .. ఫ్లైట్ టిక్కెట్లు .. స్టార్ హోటల్స్ ను నేను బుక్ చేయలేదు. 60 ఏళ్లు దాటిన పెద్దవారిని నేను బెదిరించలేదు. చిన్నవాళ్లకు స్వీట్లు పంచలేదు .. ఇంటింటికీ చీరలు పంచలేదు. అందువలన నాకు వచ్చిన ఓట్లు నిజాయితీగా వచ్చినవే.

గెలిచిన వాళ్లను నేను తప్పకుండా ఎప్పటికప్పుడు రిపోర్ట్ కార్డు అడుగుతూనే ఉంటాను. అక్కడే ఉండి క్వశ్చన్ చేస్తే బ్యాన్ చేస్తారు. వాళ్లకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే బయటకికి వచ్చేశాను. గెలిచింది విష్ణు .. మాట్లాడుతుంది మోహన్ బాబు .. ఇది ఎలా వినపడాలి నాకు. ఎన్నికల రోజున కళ్ల ముందు ఏం జరుగుతున్నా ఏం చేయలేకపోయాము. చేయండి పని .. మంత్లీ రిపోర్టు కార్డు ఇచ్చి తీరాలి ఇప్పుడు. నెక్స్ట్ టూ ఇయర్స్ పడుకోనీయను" అంటూ చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News