సెన్సార్ బోర్డుపై దర్శకుడి ధ్వజం

Update: 2017-10-28 05:58 GMT
యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు మరోసారి కోపం వచ్చింది. గతంలో ‘చందమామ కథలు’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చినపుడు.. అంతకుముందు సినిమా విడుదలైనపుడు సరైన రివ్యూలు ఇవ్వలేదంటూ మీడియా మీద ప్రవీణ్ ధ్వజమెత్తిన సంగతి తెలిసింది. ఇప్పుడు ప్రవీణ్ సెన్సార్ బోర్డు మీద పడ్డాడు. ఈ మధ్య సెన్సార్ బోర్డు ప్రతిదానికీ అభ్యంతరాలు చెబుతోందని.. దీంతో ఫిలిం మేకర్ల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ప్రవీణ్ అన్నాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క అంశం సున్నితంగా మారిపోతోందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

‘‘సినిమాలో ఒక మంత్రి తప్పు చేస్తున్నాడని చెప్పకూడదట. ఒక పోలీసు అధికారి కానీ.. ఒక ప్రభుత్వ అధికారి తప్పు చేస్తున్నట్టు చూపించకూడదట. ఇలా అయితే సినిమాలో ఇంకేం చూపిస్తాం? ఇప్పుడున్న సెన్సార్‌ బోర్డు అధికారులు అప్పట్లో ఉండుంటే ‘వందేమాతరం’.. ‘ప్రతిఘటన’ లాంటి సినిమాలు తీయడం సాధ్యమయ్యేది కాదేమో. ప్రజలు ఈ విషయంపై ప్రశ్నించాలి. ఇలాంటి పరిస్థితే కొనసాగితే సమాజంలో చైతన్యం కలిగించే సినిమాలు ఎలా వస్తాయి? మా సినిమాకి సెన్సార్‌ బోర్డు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దాంతో షాకయ్యాను. హింస.. రక్తపాతాల్లాంటివేవీ లేకుండా సినిమా తీశాం కాబట్టి ‘క్లీన్ యు’ వస్తుందనుకున్నాం. ఇప్పటితో పోలిస్తే 70లు.. 80ల్లోనే స్వేచ్ఛ ఎక్కువగా ఉండేదనిపిస్తోంది. ఒక ట్వీట్‌ చేయాలంటే పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందిప్పుడు. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ వాక్‌ స్వాతంత్య్రం ఉండాలి’’ అని ప్రవీణ్ అన్నాడు.
Tags:    

Similar News