రాధికా ఆప్టే ఎంత ట్యాలెంటెడ్ నటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంత కాలంగా బోల్డ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే కాన్సెప్ట్ తో ఆన్ లైన్ రిటైల్ సంస్థ మింత్ర యాడ్స్ తీస్తోంది. రాధికా ఆప్టే ఈసారి గర్భవుతులుగా ఉన్న మహిళలు.. ఉద్యోగంలో ఎదుర్కునే ఇబ్బందిని అవకాశంగా మార్చుకున్న విషయాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
సాధారణంగా ప్రెగ్నెన్సీతో ఉన్నవారికి ప్రాజెక్ట్స్ - ప్రమోషన్స్ ఇచ్చేందుకు సంస్థలు ముందుకు రావు. ప్రసవం తర్వాత కొన్ని నెలలు సెలవు పెడతారని, పని మీద కంటే పిల్లల మీదే ఎక్కువ దృష్టి పెడతారనే ఉద్దేశ్యంతో.. వారిని చిన్నచూపు చూస్తుంటాయి. "ఈ ప్రాజెక్ట్ పై నేను సంవత్సరాలుగా పని చేస్తుంటే.. నా వర్క్ గురించి కాకుండా, నా ప్రెగ్నెన్సీతో ప్రమోషన్ డిసైడ్ చేస్తారా" అంటూ తన సీనియర్ ని రాధిక విధించిన ప్రశ్న.. ఎంతమంది హృదయాలనో తడుతుంది.
కొత్తగా నిర్మాణంలో ఉన్న ఓ ఏరియాని చూపించి.. అది నేను కట్టుకుంటున్న స్వంత ఆఫీస్.. నా బిజినెస్ నేను స్టార్ట్ చేసుకుంటున్నా అంటూ తన పై అధికారిణికి ఇచ్చిన ఝలక్ అయితే.. సూపర్బ్. సమాజంలో ఉన్న సున్నితమైన సమస్యను చూపుతూ.. దాన్ని సమర్ధంగా ఎదుర్కున్న మహిళగా రాధికా ఆప్టే జీవించేసింది. మరోసారి హ్యాట్సాఫ్ అనిపించుకుంది రాధికా ఆప్టే.