ప్రియాంక చోప్రా ఆత్మహత్యాయత్నం!

Update: 2016-04-03 11:30 GMT
సినిమా వాళ్లకేంటండీ.. కావాల్సినంత డబ్బు.. లగ్జరీ జీవితం.. సొసైటీలో పేరు ప్రతిష్టలు.. ఇంతకంటే ఏం కావాలి అనుకుంటాం. కానీ ఆ అందమైన జీవితం వెనుక ఎన్నో విషాద ఘట్టాలు ఉంటాయి. అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక జీవితం మీద విరక్తితో ఉండే సెలబ్రెటీలు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్లలో కొందరు గట్టిగా నిలబడి ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిస్తే.. ఇంకొందరు ఒత్తిడిని తట్టుకోలేక అర్ధంతరంగా తనువు చాలిస్తుంటారు. ప్రపంచ సుందరిగా.. బాలీవుడ్ టాప్ హీరోయిన్‌ గా.. ఇండియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా.. గొప్ప పేరు సంపాదించిన ప్రియాంక చోప్రా సైతం ఇలాగే ప్రాణాలు తీసుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నించిందన్న వార్తలు వింటుంటే ఆమె అభిమానులు విస్తుపోతున్నారు.

ప్రియాంక కొన్నిసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ ఆమె మాజీ మేనేజర్ ప్రకాష్ జాజునే వెల్లడించడం సంచలనం రేపుతోంది. టీవీ నటి ప్రత్యూష బెనర్జీ(24) ఆత్మహత్య నేపథ్యంలో ప్రకాష్.. ప్రియాంక చోప్రాకు సంబంధించి సంచలన సంగతుల్ని ట్విట్టర్లో బయటపెట్టాడు. ‘‘ప్రియాంక ఇప్పుడు ఆత్మస్థైర్యంలో కనబడుతుందేమోగానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కెరీర్ లో నిలదొక్కుకునే క్రమంలో ఆమె రెండు - మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే సమయానికి నేను ఆపగలిగాను’’ అంటూ ట్వీట్ చేశాడు ప్రకాష్.

ప్రియాంక ఒకప్పుడు అజీమ్ మర్చంట్ తో సన్నిహితంగా ఉండేదని.. ఓసారి అతడితో గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని.. అప్పుడు తనే అడ్డుపడ్డానని చెప్పాడు ప్రకాష్. ప్రియాంకకు అజీమ్ తల్లితో చాలా అనుబంధం ఉండేదని.. ఆమె మరణించినపుడు ప్రియాంక బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవాలని చూసిందని.. ఐతే తాను సమయానికి ప్రియాంకను పట్టుకుని కుర్చీకి కట్టేసి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నానని ట్వీట్లలో పేర్కొన్నాడు ప్రకాష్. కొన్నేళ్ల కిందట ప్రియాంకకు ప్రకాష్ తో విభేదాలు రావడంతో అతడితో కాంట్రాక్టు రద్దు చేసుకుంది. అతను ముంబై కోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత ప్రకాష్ తన కూతుర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కేసు పెట్టాడు. ఈ కేసుకు సంబంధించి ప్రకాష్ కొన్నాళ్లు జైల్లో కూడా ఉండటం విశేషం. అలాంటి వాడు ప్రియాంక గురించి ఇలా ట్వీట్లు చేయడం ఆసక్తి రేపుతోంది. దీనిపై ప్రియాంక ఏమంటుందో చూడాలి.
Tags:    

Similar News