ఓటీటీల‌పై బ‌న్నీవాసు సంచ‌ల‌న కామెంట్స్‌

Update: 2022-06-28 13:01 GMT
క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఓటీటీ సంస్కృతి మొద‌లైంది. చాలా మంది స్టార్ హీరోలు కూడా త‌మ సినిమాల‌ని నేరుగా ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డంతో వీటి ప్ర‌భావం రాను రాను థియేట‌ర్ల‌పై ప‌డి ప్ర‌స్తుతం స్టార్ సినిమా అయితే కానీ థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాని ప‌రిస్థితికి వ‌చ్చేసింది. ఇదే కొన‌సాగితే రానున్న రోజుల్లో థియేట‌ర్ల వ్య‌వ‌స్త నామ‌రూపాలు లేకుండా పోతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు, సినీ విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు ఓటీటీపై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ఇటీవ‌ల థియేట‌ర్లలో విడుద‌లైన సినిమాలు కొన్ని రోజుల్లోనే ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న విష‌యం తెలిసిదే. గ‌తంలో టైమ్ బాండ్ వుండేది. కానీ ఇప్ప‌డు వారాల్లోనే క్రేజీ సినిమాలు కూడా ఓటీటీలోకి వ‌చ్చేస్తుండ‌టం ప‌లువురిని విస్మ‌యానికి గురిచేస్తోంది. దీనిపై నిర్మాత బ‌న్నీవాసు తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొత్త సినిమాల‌ని 50 రోజుల వ‌ర‌కు ఓటీటీ కి ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్మాత‌లు ఆలోచ‌న చేస్తున్నార‌ని తెలిపారు.

త్వ‌ర‌గా కొత్త సినిమాలు ఓటీటీలోకి రావ‌డం వ‌ల్ల థియేట‌ర్ల వ్య‌వ‌స్థ కే కాకుండా పెద్ద హీరోల‌కు కూడా తీర‌ని న‌ష్టంగా మారే అవ‌కాశం వుద‌ని, దాంతో స్టార్ హీరోల‌కున్న క్రేజ్ కూడా త‌గ్గే ప్ర‌మాదం వుంద‌న్నారు. సినిమా విడుద‌ల విష‌యంలో ఓ అగ్ర హీరో నిర్మాత‌తో ఒప్పందం చేసుకున్నార‌ని, త‌న అనుమ‌తి లేకుండా సినిమాని 50 రోజుల వ‌ర‌కు ఓటీటీల‌కు ఇవ్వోద్ద‌ని సూచించార‌ని, సినిమాల ఓటీటీ విడుద‌ల‌పై రేపు అంటే బుధ‌వారం నిర్మాత‌లు స‌మావేశం కానున్నార‌ని తెలిపారు.

గోపీచంద్ హీరోగా బ‌న్నీవాసు నిర్మించిన చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`. యువీ క్రియేష‌న్స్ తో క‌లిసి నిర్మించిన ఈ మూవీ జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు ఓటీటీ రిలీజ్ ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఆయ‌న మ‌రిన్ని విశేసాలు తెలియ‌జేస్తూ `సినిమా రంగంలో కోవిడ్ త‌రువాత ప‌బ్లిసిటీకి సంబంధించిన ఖ‌ర్చు లు పెరిగాయి.. వ‌సూల్లు త‌గ్గాయ‌న్నారు.

ఫ‌లానా సినిమా 30 రోజుల్లోనో.. 40 రోజుల్లోనో.. ఓటీటీలోకి వ‌చ్చేస్తుందిలే అని ప్రేక్ష‌కులు అనుకుంటే ఎవ్వ‌రం ఏమీ చేయ‌లేం. ప్ర‌స్తుతం నెల‌కొన్న అన్ టైన్ టికెట్ బుకింగ్ ప‌రిస్థితుల‌పై ఎగ్జిబిట‌ర్ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఎన్నో సందేహాలున్నాయి. ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం ఏదైనా స‌మావేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన సినిమాల‌ని ఎంత కాలానికి ఓటీటీల్లోకి తీసుకురావాల‌నే దానిపై రీసెర్చ్ జ‌రుగుతోంది. ఫ్లాప్ సినిమాని ఓటీటీకి ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతానికి లాభం చేకూరిన‌ట్టుగా క‌నిపిస్తోంది కానీ అదే భ‌విష్య‌త్తులో థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపే ప్ర‌మాదం వుంది` అని పేర్కొన్నారు బ‌న్నీ వాసు.
Tags:    

Similar News