భరత్ కలెక్షన్లు ఫేక్ కాదన్న నిర్మాత

Update: 2018-04-28 18:10 GMT
మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు.. వారం రోజుల్లోనే రూ.161 కోట్ల గ్రాస్ సాధించిందంటూ చిత్ర బృందం ఇచ్చిన ప్రకటనలు కొంచెం అతిశయోక్తిగా అనిపించాయి. ఇవి ఫేక్ కలెక్షన్లంటూ ప్రచారం జరిగింది. దీనిపై నిర్మాత డీవీవీ దానయ్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. శనివారం తిరుపతిలో చిత్ర బృందం విజయోత్సవ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడాడు. ‘భరత్ అనే నేను’కు సంబంధించి తాము ప్రకటించిన కలెక్షన్లు ఫేక్ కాదన్నాడు.

‘‘మా సినిమా కలెక్షన్లను నేనే అఫీషియల్‌ గా ప్రకటించాను. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారానికి 161.28 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. ఇవి ఒరిజినల్ కలెక్షన్లు’’ అని దానయ్య స్పష్టం చేశాడు. ‘భరత్ అనే నేను’ నిర్మాతగా తనకెంతో గౌరవం తెచ్చిపెట్టిందని దానయ్య అన్నాడు. ‘‘మా సంస్థకు ఇంత పెద్ద బ్లాక్‌ బస్టర్ విజయం ఇచ్చిన కొరటాల శివ గారికి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా నిర్మాణ విషయంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే..  అందరికీ సారీ చెబుతున్నాను. ఈ సినిమా తర్వాత నేను ఎక్కడ కనిపించినా నాతో జనాలు సెల్ఫీలు దిగుతున్నారు. చాలా గర్వంగా ఉంది. మాట్లాడడానికి మాటలు కూడా రావడం లేదు’’ అని దానయ్య చెప్పాడు.
Tags:    

Similar News