పారితోషికం త‌గ్గించ‌మ‌ని బ‌తిమాల‌డం నిర్మాత‌ల అస‌మ‌ర్థ‌త‌!-సి.క‌ళ్యాణ్

Update: 2020-10-04 17:32 GMT
టాలీవుడ్ లో మునుపెన్న‌డూ లేని విధంగా అసోసియేష‌న్లు ఐక్య‌మై హీరోల పారితోషికాల‌పై రివ్యూ చేయ‌డం సంచ‌ల‌న‌మే అయ్యింది. తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ - మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్- ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్- ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ - యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అందరూ కలిసి మ‌హ‌మ్మారీ వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌కు జరిగిన నష్టంపై చర్చించి నటీనటుల రెమ్యునరేషన్‌ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

డైలీ 20 వేలు అందుకునే ఆర్టిస్టుల‌కు.. ఓవ‌రాల్ గా 5ల‌క్ష‌లు అంత‌కుమించి అందుకునే టెక్నీషియ‌న్ కి .. 20శాతం కోత విధించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. పారితోషికం నిర్ణ‌యించాల్సింది నిర్మాత‌లే. ఇలా 20శాతం త‌గ్గించ‌మ‌ని బ‌తిమాల‌డం నిర్మాత‌ల అస‌మ‌ర్థ‌త‌. గ్రూపు రాజ‌కీయాల‌తో ప‌రిశ్ర‌మ‌కు డ్యామేజ్ అవుతోంది. అది స‌రికాదు. కూర్చుని మాట్లాడుకోవాలి. నిర్మాత‌లు ఐక్యంగా ఉండాలి. దొంగల్లా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు.. అని వ్యాఖ్యానించారు. గోడ‌మీద పిల్లి వాటం నిర్మాత‌ల వ‌ల్ల‌నే స‌మ‌స్య‌లొస్తున్నాయి. అక్టోబ‌ర్ 15 నుంచి థియేట‌ర్లు తెరుచుకునే వెసులుబాటు కేంద్ర‌ ప్ర‌భుత్వం క‌ల్పించినా రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించాల్సి ఉంటుంది ఇంకా.

ఈ స‌న్నివేశంలో పెద్ద సినిమాను కూడా రిలీజ్‌ చేయలేని పరిస్థితి ఉంది. 50 శాతం థియేటర్‌ ఆక్యుపెన్సీతో బతికి బట్టకట్టలేం.. నిర్మాత‌లు థియేట‌ర్ య‌జ‌మానుల‌కు ఇది గడ్డు సమస్య అంటూ విశ్లేషించారు. అయితే సి.క‌ల్యాణ్ వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్ధేశించి అన్న‌ది ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.




Tags:    

Similar News