యాంగ్రీ యంగ్ మేన్ పాత్రలకు ఒకప్పుడు రాజశేఖర్ కు బాగా సూటయ్యేవి. తన కెరీర్ లో ఎక్కువ హిట్లు ఆ జోనర్ లోనే వచ్చాయి. రాజశేఖర్ సమకాలికులు అంతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి చాలాకాలమైంది. కానీ ఆయన మాత్రం హీరోగానే కొనసాగుతున్నాడు. తనకు అచ్చొచ్చిన జోనర్ లో కొత్తగా పి.ఎస్.వి. గరుడవేగ 126.18ఎం సినిమా చేశాడు. గుంటూర్ టాకీస్ ఫేం దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు.
గరుడవేగ సినిమా షూటింగ్ పనులు అన్నీ పూర్తి చేసుకుంది. నవంబరు 3 నాటికి దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ‘‘గరుడవేగ సినిమా షూటింగ్ ఐదు దేశాల్లో చేశాం. సినిమా అవుట్ పుట్ చూశాక చాలా హ్యాపీగా ఫీలయ్యాం. క్యారెక్టర్లన్నీ బాగా వచ్చాయి. ప్రవీణ్ సత్తారు తన సత్తా మరోసారి నిరూపించుకోనున్నాడు. ప్రమోషనల్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అంటున్నారు నిర్మాత కోటేశ్వర్ రాజు. ఈసినిమాలో సన్నీలియోన్ ఐటం సాంగ్ చేస్తోంది. తెలుగులో ఇంతకుముందు కరెంట్ తీగలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసిన ఆమె మళ్లీ గరుడవేగలో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మత్తెక్కించనుంది.
యాక్షన్ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కిన గరుడవేగ సినిమాకు రూ. 25 కోట్ల వరకు ఖర్చు పెట్టారని మేకర్స్ చెబుతున్నారు. సబ్జెక్టుపై నమ్మకం ఉన్నా రాజశేఖర్ కు ఈ మధ్య సక్సెస్ లే లేవు. సినిమా బ్రహ్మాండంగా ఉందని టాక్ వస్తే తప్ప ఈ మొత్తం రికవర్ చేయడం సాధ్యపడదు. మరి ఈ మూవీ ఫ్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.