పూరి ఆలోచ‌న సూప‌ర్.. కానీ అది జ‌రిగే ప‌నేనా?

Update: 2022-12-13 11:30 GMT
పూరి జ‌గ‌న్నాథ్‌.. ఈ పేరు పాపుల‌ర్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం త‌న సినిమాల్లో హీరో ప‌లికే ప‌దునైన సంభాష‌ణ‌లే. వ్య‌వ‌స్థ‌పై సెటైర్లు వేస్తూ హీరో చెప్పే డైలాగ్స్ పాపుల‌ర్ కాడంతో ద‌ర్శ‌కుడిగా పూరికి మంచి గుర్తింపు ల‌భించింది. ఆ శైలి న‌చ్చే హీరోలు చాలా వ‌ర‌కు పూరితో క‌లిసి సినిమాలు చేశారు.. ఇప్ప‌టికీ స్టార్స్ త‌న‌తో సినిమాలు చేయాల‌నుకుంటున్నారు. పూరీది ప‌వర్ ఫుల్ పెన్‌. త‌ను రాసే డైలాగ్ లు ఆలోచ‌నాత్మ‌కంగా వుంటాయ‌న్న‌ది ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసిందే.

ఇందుకు నిద‌ర్శ‌న‌మే 'ఇడియ‌ట్'లో 'క‌మీష‌న‌ర్ కూతుళ్ల‌కు పెళ్లిళ్లు కావా.. మొగుళ్లు రారా.., ' 'బిజినెస్ మెన్' మూవీ క్లైమాక్స్ లో 'మీరు అడుగుతున్నారు కాబ‌ట్టి చెబుతున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం.. దేవుడు మ‌న‌ల్ని వార్ జోన్ లో ప‌డేశాడు. బీ అలెర్ట్.. ప్రొటెక్ట్ యువ‌ర్ సెల్ఫ్‌.. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి.. క‌సితో ప‌రుగెత్తండి.. పాడాలంటే క‌సిగా పాడండీ.. చ‌ద‌వాలనుకుంటే క‌సిగా చ‌దివేయండి..' అంటూ పూరి రాసిన డైలాగ్ ల‌కు థియేట‌ర్లు చ‌ప్ప‌ట్ల తో మారుమోగాయి.

అంత‌టి ప‌వ‌రున్న పూరి పెన్నుకు ఈ మ‌ధ్య కాస్త ఆ ప‌వ‌ర్ త‌గ్గింది. అయితే సినిమాల్లో పేల‌క‌పోతున్నా 'పూరి మ్యూజింగ్స్'తో  పాడ్ కాస్ట్ ఆడియోల‌తో పూరి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఈ మ‌ధ్య 'లైగ‌ర్‌' ఫ్లాప్ కార‌ణంగా త‌గ్గించిన పూరి మ‌ళ్లీ తాజాగా మొద‌లు పెట్టాడు.

చాలా వ‌ర‌కు ఆస‌క్తిక‌ర‌మైన కొత్త కొత్త విష‌యాల‌పై పూరి మ్యూజింగ్స్ అంటూ ఆడియోలు విడుద‌ల చేసిన పూరి కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ మొద‌లు పెట్టాడు.

మ‌రింత ప‌దునెక్కిన డైలాగ్ లు, ఆలోచ‌న‌ల‌తో మ‌రో సారి పూరి ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సారి 'గుడ్ సిటిజ‌న్‌' ఐడియాతో వ‌చ్చాడు. రీసెంట్ గా మ‌నుషుల్లో వున్న 'త‌డ్కా'ని త‌గ్గించుకుంటే మంచిది అంటూ ఓ ఆడియో వ‌దిలిని పూరి తాజాగా బ్రిటియంట్ ఐడియాతో 'గుడ్ సిటిజ‌న్‌' అంటూ ఓ ఆడియోని రిలీజ్ చేశాడు. దీని వ‌ల్ల స‌మాజంలో మంచితో పాటు మంచి వాళ్లు పెరుగుతార‌న్నాడు. మంచి వారిని, మంచి ప‌నులు చేసేవారిని, సాటివారిని ఆదుకునే వారిని గుడ్ సిటిజ‌న్స్ గా ప్ర‌భుత్వాలు గుర్తించాల‌న్నాడు.

అంతే కాకుండా వారిని గుర్తించి ప్ర‌భుత్వం గుర్తింపు కార్డుల్ని అందించాల‌ని, ఓ వ్య‌వ‌స్థ‌ని ఏర్పాటు చేయ‌యాల‌ని, వారికి బ‌స్సుల్లో, రైళ్ల‌లో రాయితీలు ఇవ్వ‌డ‌మే కాకుండా ప‌న్ను రాయితీని కూడా ప్ర‌క‌టించాల‌న్నాడు. ఉద్యోగాల్లోనూ వారికి రిజ‌ర్వేష‌న్ లు ప్ర‌క‌టించాల‌న్నాడు. అప్పుడే ఉత్త‌మ పౌరులు త‌యార‌వుతార‌ని, దేశం బాగుప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌భుత్వాలు ఎప్ప‌టికైనా ఈ ఐడియాను ఆచ‌రించాలనే కోరిక వుంద‌న్నాడు. ఐడియా సూప‌ర్ .. కానీ ఈ రోజుల్లో ప్ర‌భుత్వాలు పూరి కోరిక‌ను ప‌ట్టించుకుంటాయా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News