'పుష్ప' ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Update: 2021-09-14 02:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ''పుష్ప''. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని 'పుష్ప: ది రైజ్' పేరుతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. 2021 క్రిస్మస్ సీజన్ సందర్భంగా డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.

క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25వ తేదీన అయినప్పటికీ.. ఆ సీజన్ ని క్యాష్ చేసుకోడానికి సాధారణంగా సినిమాలను కాస్త ముందుగానే రిలీజ్ చేస్తుంటారు. ఈసారి ఫెస్టివల్ శనివారం వచ్చింది. అందుకే డిసెంబర్ 24న శుక్రవారం రోజున పలు కొత్త సినిమాల విడుదలలు ప్రకటించారు. వాటిలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ - యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమా కూడా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో 'లాల్ సింగ్ చద్దా' చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో 'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఒక వారం ముందుగానే, అంటే డిసెంబర్ 17న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో నార్త్ లో 'లాల్ సింగ్ చ‌ద్దా' చిత్రంతో పోటీ పడటం కంటే.. ముందే వచ్చి క్రిస్మస్ వరకు కలెక్షన్స్ కొల్లగొట్టాలని పుష్పరాజ్ ఆలోచిస్తున్నారట. సినిమా బాగుంటే రెండో వారంలో ఎలాగూ ప్రభావం చూపుతుంది. ఆపై వచ్చే వారంలో డిసెంబర్ 31 - జనవరి 1 కూడా కలిసి వస్తాయి. అందుకే మేకర్స్ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని.. 'పుష్ప-1' కోసం డిసెంబర్ 17నే ఫిక్స్ చేస్తారని టాక్ నడుస్తోంది.

ఏదేమైనా 2021లో థియేటర్లలోకి వచ్చే భారీ సినిమా 'పుష్ప' అనే చెప్పాలి. దసరా సందర్భంగా రావాల్సిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం ఇప్పటికే వాయిదా పడింది. ఈ ఏడాది వస్తాయనుకున్న 'రాధే శ్యామ్' 'భీమ్లా నాయక్' చిత్రాలు వచ్చే సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఇన్నాళ్లు పుష్ప కు పోటీగా మారుతుందని భావించిన 'కేజీయఫ్ 2' సినిమా కూడా 2022 సమ్మర్ కు పోస్ట్ పోన్ అయింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ ఆశలన్నీ అల్లు అర్జున్ సినిమాపైనే ఉన్నాయి. అప్పటికి థియేటర్లు కూడా పూర్తి స్థాయిలో నడుస్తాయి కాబట్టి.. 'పుష్ప' చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంటే భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

కాగా, 'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆర్య' 'ఆర్య 2' వంటి చిత్రాల తర్వాత బన్నీ - సుక్కూ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tags:    

Similar News