ఆ 'ఉద్యమ' హీరో పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పేశారు

Update: 2021-08-29 08:45 GMT
టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉంటారు. కానీ.. వారందరికి భిన్నం ఆర్ నారాయణ మూర్తి. ఉద్యమ సినిమాలు తీయటం ఆయనకు అలవాటు. హిట్టా.. పట్టా అన్నది పట్టించుకోకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వెండితెర మీద చూపించటం ఆయనకు ఇష్టం. మిగిలిన వారు ఏమనుకుంటారో అన్నది పట్టదు. ఒకప్పుడు సామాజిక సమస్యలు.. ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన సినిమాల్ని ఆదరించేవారు. అప్పట్లో ఆయన తీసిన సినిమాలకు కోట్లాది రూపాయిల కలెక్షన్లు వచ్చేవి. తాజాగా ఆయన నిర్మించిన రైతన్న మూవీ కొన్ని థియేటర్లలోనే విడుదలైంది. మిగిలిన థియేటర్లలో మరోసారి విడుదల చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

సినిమా రంగానికి చెందిన వారంటేనే.. గ్లామర్ కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ.. నారాయణ మూర్తి మాత్రం గ్రామర్ కు మాత్రమే విలువనిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది హీరోలు ఉన్నా.. సినిమాను వ్యసనంగా ఫీలయ్యే వారు.. దాంతో సహజీవనం చేసే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. నారాయణమూర్తి ఫ్యామిలీ డిటైల్స్ పెద్దగా బయటకు రావు. పెళ్లి కూడా చేసుకోలేదన్న మాటే కానీ.. ఎందుకు? ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం లభించదు.

తాజాగా ఆ కొరత తీర్చేస్తూ ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ ముచ్చట్లు చెప్పారు. తాను ఒంటరిగా సోలో బతుక్కి కారణం ఆయన చెప్పిన మాటలు వింటే.. ఆయన మీద అప్పటివరకు ఉన్న ఫీలింగ్ మరోలా మారిపోవటం ఖాయం. చూసే మనిషికి.. ఆయనలోని మనసుకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. మనందరికి కనిపించే ఆర్ నారాయణ మూర్తికి.. ఆయన లోపలి మనిషికి మధ్యనున్న తేడా ఏమిటన్నది ఆయన పెళ్లి ఎపిసోడ్ గురించి తెలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇంతకీ తానెందుకు బ్రహ్మచారిగా ఉన్నాడన్న విషయాన్ని ఆయన మాటల్లోనే వింటే..

''నేను బ్రహ్మచారిని. పెళ్లి చేసుకోలేదు. దీని వెనక ఒక కారణముంది. అమ్మ,నాన్న చాలా మంచి వాళ్లు. కానీ కులం, మతం పట్టింపులు ఎక్కువ. ఒక అంటరాని వ్యక్తిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నానని.. మా నాన్న నన్ను తరిమి తరిమి కొట్టాడు. అప్పటి పరిస్థితులు అంత ఘోరంగా ఉండేవి. నేను నటుడిని అయిన తర్వాత- ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అడిగా. వాళ్లకు ఇష్టం లేదు. వేరే వాళ్లను చేసుకోవటం నాకు ఇష్టం లేదు. దాంతో బ్రహ్మచారిగానే ఉండిపోయా. కానీ వయస్సు పెరుగుతున్న కొలది తోడు అవసరం. తోడు లేకపోతే ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. అందుకే పెళ్లి చేసుకోననే కుర్రాళ్లకు నేను పెళ్లిచేసుకొమ్మని సలహా ఇస్తూ ఉంటా'' అని చెప్పారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని.. లేదంటే ఇబ్బందే అని చెప్పే ఆయనలోని సున్నితత్వం ఎంతన్నది తాజా ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
Tags:    

Similar News