మూవీ రివ్యూ : రాధె

Update: 2021-05-13 14:43 GMT
చిత్రం : ‘రాధె’

నటీనటులు: సల్మాన్ ఖాన్-దిశా పఠాని-రణదీప్ హుడా-జాకీష్రాఫ్-భరత్-మేఘా ఆకాష్ తదితరులు
సంగీతం: సాజిద్ వాజిద్-దేవిశ్రీ ప్రసాద్-హిమేష్ రేషమ్మియా
నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా
ఛాయాగ్రహణం: అయానంక బోస్
రచన: విజయ్ మౌర్య-ఏసీ ముగిల్
నిర్మాతలు: సల్మాన్ ఖాన్-సోహైల్ ఖాన్-అతుల్ అగ్నిహోత్రి
దర్శకత్వం: ప్రభుదేవా

కరోనా కారణంగా ఏడాదికి పైగా పేరున్న సినిమాల రిలీజ్ లేక వెలవెలబోతూ వస్తోంది బాలీవుడ్. ఇలాంటి తరుణంలో సల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’ రంజాన్ కానుకగా విడుదలకు సిద్ధం కావడంతో హిందీ ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం తీసుకొచ్చింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న థియేటర్లతో పాటు ‘జీ’ ఓటీటీలో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ఒకేసారి విడుదలైందీ చిత్రం. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ మాస్ మసాలా సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ముంబయిలో విపరీతంగా మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోయి నగరంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్న సమయంలో దీన్ని అదుపు చేయడానికి సరైన వ్యక్తి కోసం చూస్తుంటుంది పోలీస్ విభాగం. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరు సంపాదించి ఒక కేసులో చేసిన తప్పిదం కారణంగా సస్పెన్షన్లో ఉన్న రాధె (సల్మాన్ ఖాన్)యే ఈ సమస్యను పరిష్కరించడానికి సమర్థుడు అని ఉన్నతాధికారులు భావిస్తారు. సస్పెన్షన్ ఎత్తేసి అతడికి  ఈ కేసు బాధ్యతలు అప్పగిస్తారు. అతను కింది స్థాయి నుంచి డ్రగ్స్ సమస్యను పరిష్కరించడం మొదలుపెడతాడు. ఐతే ఈ డ్రగ్ నెట్ వర్క్ వెనుక ఉన్నది అత్యంత క్రూరుడైన రాణా (రణదీప్ హుడా) అనే డ్రగ్ డీలర్ అని తెలుస్తుంది. అతడి కోసం రాధె వేట ఎలా సాగింది.. ముంబయిని డ్రగ్ ఫ్రీగా మారుస్తానంటూ అతను చేసిన శపథాన్ని నెరవేర్చాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఓపెన్ చెయ్యగానే ఒక పెద్ద సిటీ. అందులో ఎక్కడ చూసినా డ్రగ్స్. స్టూడెంట్స్ వాటికి బానిసై పిచ్చోళ్లవుతుంటారు. ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. పోలీసులు ఏమీ చేయలేకపోతుంటారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారుల సమావేశం. సిటీలో డ్రగ్ మాఫియా ఆగడాలు ఎలా ఆపాలంటూ అందరికంటే పెద్ద అధికారి సీరియస్ అయిపోతుంటాడు. ఒక అధికారేమో స్పెషల్ టీం ఏర్పాటు చేశాం. కానీ వాళ్లను కూడా బతకనివ్వలేదు అని సమాధానం. ఇంకేం చేద్దాం అంటూ ఉన్నతాధికారి ప్రశ్నించగా.. మరో అధికారి ఈ కేసును డీల్ చేయడానికి ఒక ‘స్పెషలిస్టు’ కావాలి. అంటాడు. అంతే మొదలైపోతుంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్. ఆయన ‘రాధె’ అని పేరు చెబుతాడు. ఇక ఆయన గారు మన హీరో గురించి ఎలివేషన్లు ఇస్తుంటే.. మరోచోట అతను తన విశ్వరూపం చూపించేస్తుంటాడు. అక్కడ ఫైట్ ముగించుకుని రాగానే పోలీసు ఉన్నతాధికారులు అతడి దగ్గరికే వచ్చి కేసు ఫైల్ హ్యాండోవర్ చేస్తాడు. కాసేపటికి హీరో ‘ఈ సిటీని నేను క్లీన్ చేస్తా’ అంటూ శపథం చేస్తాడు. అంతే ఇక క్లైమాక్స్ ఫైట్ వరకు హీరోకు ఎలివేషన్లే ఎలివేషన్లు. మరీ ఏకపక్షంగా సినిమా సాగిపోకూడదని.. మధ్య మధ్యలో హీరోకు చిన్న చిన్న అడ్డంకులు మినహాయిస్తే హీరోకు ఎదురే ఉండదు.

పైన చెప్పుకున్న ఇంట్రో సీన్ మొదలుపెట్టి.. ఈ ఫార్మాట్లో తెలుగులో ఎన్ని వందల సినిమాలు చూసి ఉంటాం. ఈ ‘ఫార్ములా’ను మన వాళ్లు పక్కన పడేసి ఎన్నో ఏళ్లయిపోయింది. మాస్ సినిమాలను బాగా ఎంజాయ్ చేసే వాళ్లు కూడా మరీ ఇలా ఒక ఫార్ములా ప్రకారం కథ, సన్నివేశాలు సాగిపోతే విసుక్కుంటున్నారు. ఐతే తెలుగులోనే దర్శకుడిగా అరంగేట్రం చేసి ఇక్కడి సినిమాలను హిందీలో రీమేక్ చేసి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా.. దక్షిణాదిన ఎప్పుడో అరిగిపోయిన మాస్ ఫార్ములాలు పట్టుకుని ‘రాధె’ సినిమాను తీర్చిదిద్దాడు. సినిమా టైటిల్స్‌లో ఇది కొరియన్ మూవీ ‘ది ఔట్ లాస్’ అనే కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కిందని వేస్తే.. కథ ఏమైనా కొత్తగా ఉంటుందేమో, దానికి ప్రభుదేవా మాస్ టచ్ ఇచ్చాడేమో అనుకుంటాం. కానీ కథ పరంగా ఇందులో ఏ విశేషమూ లేదు. పాత చింతకాయ పచ్చడిలా కనిపించే కథను కొంచెం స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయడం.. యాక్షన్ సన్నివేశాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడం.. అభిమానులను అలరించే సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్ మినహాయిస్తే ‘రాధె’లో ఏ విశేషాలు లేవు.

పూర్తిగా సల్మాన్ అభిమానులను, మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసిన సినిమా ‘రాధె’. ఆరంభం నుంచి చివరిదాకా హీరో ఎలివేషన్ల మీదే సినిమా నడుస్తుంది. హీరో ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసమే. అతను వరుసబెట్టి గ్యాంగులను ఏరిపారేస్తుంటాడు. హీరో ఒక డెన్‌లోకి వెళ్లాడంటే.. ముందు అక్కడుండే దాదా ఎవడ్రా నువ్వు అంటూ తేలిక చేసి మాట్లాడటం.. హీరో ఏమో అక్కడున్న పదుల మందిని చితగ్గొట్టేయం.. గ్యాంగ్ లీడర్ కాళ్ల బేరానికి వచ్చేయడం.. ఇదీ వరస. ఇంటర్వెల్ వరకు ఇలాంటి సన్నివేశాలే రిపీటవుతూ ఉంటాయి. ఇవి కాకుండా ‘గజిని’ సినిమాలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్‌ ను యాజిటీజ్ దించేసి రొమాన్స్-కామెడీ పండించాలని చూశాడు ప్రభుదేవా. సంబంధిత సన్నివేశాలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. స్టార్ హీరోలు చేసే మాస్ సినిమాల్లో కథానాయిక పాత్ర ఎలా ఉంటుందో సరిగ్గా దిశా పఠాని క్యారెక్టర్ అలాగే ఉంటుంది. సన్నివేశాల్లోనే కాక.. పాటల్లోనూ బోలెడంత గ్లామర్ విందు చేసి దిశా తన బాధ్యతను బాగానే నిర్వర్తించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ లోనే హీరో-విలన్ మధ్య ఫైట్ పెట్టి మాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు ప్రభుదేవా. ఐతే దీని వల్ల ద్వితీయార్ధం మరింత బలహీన పడిపోయింది. ముందే హీరో-విలన్ ఎదురుపడిపోవడంతో ఆ తర్వాత వారి మధ్య క్లాష్ ఏమంత ఆసక్తికరంగా అనిపించవు. ఇద్దరి మధ్య ఎత్తులు పైఎత్తులతో సాగే సన్నివేశాలన్నీ చాలా రొటీన్ గా అనిపిస్తాయి. ఏ కొత్తదనం.. మలుపులు లేకుండా చాలా ఫ్లాట్ గా సాగిపోయే రాధె.. ఒక భారీ యాక్షన్ ఘట్టంతో ముగుస్తుంది. మధ్య మధ్యలో సెంటిమెంటు పండించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. హిందీలో మసాలా సినిమాలు తగ్గిపోయి యూట్యూబ్‌ లో డబ్బింగ్ సినిమాలకు కోట్లల్లో వ్యూస్ అందిస్తున్న ఉత్తరాది మాస్ ప్రేక్షకులకు ‘రాధె’ నచ్చుతుందేమో కానీ.. మన ప్రేక్షకులైతే మాత్రం ఓటీటీలో 249 రూపాయలు పెట్టి చూడదగ్గ వర్త్ ఎంతమాత్రం ఈ సినిమాలో లేదు.

నటీనటులు:

సల్మాన్ ఖాన్ పూర్తిగా తన అభిమానులకు నచ్చే మేనరిజమ్స్.. స్క్రీన్ ప్రెజెన్స్.. పెర్ఫామెన్స్ ఇచ్చాడు ‘రాధె’లో. అతను చేసే మాస్ మసాలా సినిమాలకు అలవాటు పడ్డ వాళ్లకు ఇవన్నీ ఓకే అనిపించొచ్చు కానీ.. మిగతా ప్రేక్షకులకు ఇందులో సల్మాన్ కొత్తగా ఏమీ కనిపించడు. దిశా పఠాని పూర్తిగా ఒక గ్లామర్ డాల్ లాగా కనిపించింది. కుర్రాళ్లకు బాగానే కనువిందు చేసింది. తన పాత్ర.. నటన గురించి చెప్పడానికేమీ లేదు. జాకీష్రాఫ్ జోకర్ టైపు పాత్రతో కామెడీ పండించడానికి విఫలయత్నం చేశాడు. విలన్ పాత్రలో రణదీప్ హుడా లుక్.. నటన ఓకే అనిపిస్తాయి. ఇలాంటి సినిమాలో మెయిన్ విలన్ పాత్ర ఉండాల్సిన స్థాయిలో అతను చేసిన రానా క్యారెక్టర్ లేదు. తమిళ నటుడు భరత్.. మేఘా ఆకాశ్ ఇందులో హీరో పక్కనుండే పోలీసాఫీసర్ల పాత్రలు చేశారు. అవేమంత ప్రత్యేకంగా కనిపించవు. మేఘా పాత్ర అయినా పర్వాలేదు కానీ.. భరత్ ఈ సినిమా ఎందుకు చేశాడో అర్థం కాదు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

‘రాధె’ వీడియో సాంగ్స్ ముందే యూట్యూబ్ ‌లోకి వచ్చేశాయి. అన్నింట్లోకి మన దేవిశ్రీ ప్రసాద్ చేసిన ‘సీటీమార్’ హుషారుగా అనిపిస్తుంది. జూమ్ జూమ్ పాట కూడా పర్వాలేదు. పాటలు కొత్తగా ఏమీ కనిపించవు. ఇలాంటి మాస్ సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. సంచిత్ నేపథ్య సంగీతంలో ఏ ప్రత్యేకతా లేదు. అయానంక బోస్ విజువల్స్ రిచ్ గా.. కలర్ ఫుల్ గా అనిపిస్తాయి. ఈ సినిమా చూస్తుండగా.. అతను తెలుగులో చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ విజువల్స్ గుర్తుకు రాక మానవు. కథాకథనాల పరంగా ‘రాధె’ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. దర్శకుడు ప్రభుదేవా క్రియేటివ్ గా చేసిందేమీ లేదు. పరమ రొటీన్ టెంప్లేట్లో సినిమాను నడిపించాడు.

చివరగా: రాధె.. మోస్ట్ రొటీన్ భాయ్

రేటింగ్-2/5
Tags:    

Similar News