టాలీవుడ్ పై దెయ్యాల దాడి

Update: 2019-03-27 04:55 GMT
టాలీవుడ్ లో హారర్ సినిమాల ట్రెండ్ ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. బ‌యోపిక్ ల ట్రెండ్ తో పోటీప‌డుతూ హార‌ర్ ట్రెండ్ ఇంకా ఇంకా రాకెట్ స్పీడ్ తో దూసుకెళుతూనే ఉంది. అవే దెయ్యాలు, ఆత్మ‌లు, భూతాలు.. కానీ కాసుల గ‌ల‌గ‌ల‌ల‌కు ఆయాచిత వ‌రాలుగా మారుతున్నాయి. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ - గంగ‌ - కాంచ‌న‌ - కాంచ‌న‌2 - పిజ్జా - గీతాంజ‌లి - రాజుగారి గ‌ది 1 - 2 ఆనందో బ్ర‌హ్మ .. ఒక‌టేమిటి హార‌ర్ జోన‌ర్ లో ఎన్ని సినిమాలు వ‌చ్చినా అవ‌న్నీ హిట్లుగా నిలిచాయి. అందుకే ఇంకా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అవే సినిమాలు తీస్తున్నారు. హార‌రో జోన‌ర్ పై కొరియోగ్రాఫ‌ర్ ట‌ర్న్ డ్ డైరెక్ట‌ర్లు ప్ర‌భుదేవా - లారెన్స్ సైతం దృష్టి సారించ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ముఖ్యంగా హార‌ర్ జోన‌ర్ సినిమాలు తీయ‌డంలో లారెన్స్ మాస్ట‌ర్ ప్రొఫెష‌న‌లిజంపై ప‌లువురు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. `ముని`  ఫ్రాంఛైజీలో ఇప్ప‌టికే ముని - కాంచ‌న‌ - కాంచ‌న 2 (గంగ‌) రిలీజై సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీలో నాలుగో సినిమా కాంచ‌న 3 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ స‌మ్మ‌ర్ లో హార‌ర్ ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రిపేర‌వుతోంది. అయితే ఈ ఫ్రాంఛైజీలో ఇంత‌కుముందు క‌నీవినీ ఎరుగ‌ని కొత్త దెయ్యాల్ని లారెన్స్ చూపిస్తున్నారా?   కాంచ‌న 2లో ఫిజిక‌ల్లీ ఛాలెంజ్ డ్ నిత్యామీన‌న్ త‌ర‌హా పాత్ర‌తో ఎమోష‌న్ పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాడా? ఏం లాజిక్ వాడుతున్నాడు? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు.

మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ కం కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవా సైతం హార‌ర్ సినిమాల‌పై ఆస‌క్తి చూపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌క‌పోయినా ఈసారి అత‌డు లీడ్ పాత్ర‌లో ఓ హారర్ సినిమా వ‌స్తోంది. దేవి సిరీస్ లో  `దేవి 2` త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి `ల‌క్ష్మి` - `దేవి` చిత్రాల‌ ఫేం ఏ.ఎల్.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లారెన్స్ కాంచ‌న 3 - ప్ర‌భుదేవా- ఏ.ఎల్.విజ‌య్ ల దేవి 2 ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డ‌బోతున్నాయి. ఏప్రిల్ 12న దేవి 2 రిలీజ‌వుతుంటే - ఏప్రిల్ 19న `కాంచ‌న 3` రిలీజ్ కి రెడీ అవుతోంది. టాలీవుడ్ - కోలీవుడ్ లో సైమ‌ల్టేనియ‌స్ గా రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీటితో పాటు - త‌దుప‌రి ఇంకా ఎన్నో చిన్నా చిత‌కా సినిమాలు దెయ్యాల కాన్సెప్టుల‌తో వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఈ సీజ‌న్ లో ఏది బెస్ట్ దెయ్యం? ఎవ‌రు బెస్ట్? ఇంకా  పాత మూస ప‌ద్ధ‌తిలోనే భ‌య‌పెడ‌తారా?  కొత్త‌గా ఏదైనా ట్రై చేస్తున్నారా?  ఎన్నాళ్లీ దెయ్యాల గోల? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఎన్నో జోన‌ర్ లు ఉండ‌గా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంకా దెయ్యాల బాట‌లోనే వెళ్లాలా? అంటూ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు.
Tags:    

Similar News