విష్ణు-రాజ్ సినిమాకు భలే టైటిల్

Update: 2016-03-13 13:30 GMT
పేరులో ఏముంది అంటారు కానీ.. అది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా సినిమాలకు వచ్చేసరికి టైటిల్ అన్నది చాలా కీలకం. కొరటాల శివ-ప్రభాస్ కాంబినేషన్ లో సినిమాకు ముందు ‘వారధి’ అనే టైటిల్ పెడితే జనాలకు ఎక్కలేదు. కానీ ‘మిర్చి’ అని పేరు మార్చగానే జనాలకు ఇన్ స్టంట్ గా కనెక్టయిపోయింది. సినిమాకు హైప్ వచ్చేసింది. అందుకే టైటిల్ విషయంలో చాలా జాగ్రత్త పడుతుంటారు.. ఎంతో కసరత్తు చేస్తుంటారు ఫిలిం మేకర్స్. కామెడీ ఎంటర్ టైనర్స్ కు పెట్టింది పేరైన జి.నాగేశ్వరరెడ్డి తన సినిమాలకు హార్డ్ హిట్టింగ్ టైటిల్స్ పెడుతుంటాడు. సీమశాస్త్రి - దేనికైనా రెడీ - కరెంటు తీగ లాంటి టైటిళ్లు అలాగే జనాలకు బాగా కనెక్టయ్యాయి.

తాజాగా నాగేశ్వరరెడ్డి మంచు విష్ణు-రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వీడు అదో టైపు.. వాడు మరో టైపు’ అనే టైటిల్ పెడుతున్నట్లు సమాచారం. టైటిల్ కొంచెం పొడుగైనప్పటికీ.. జనాలకు ఈజీగా కనెక్టయ్యేలాగే ఉంది. సినిమా మాంచి కామెడీ ఎంటర్ టైనర్ అయి ఉంటుందన్న సంకేతాలిస్తోంది ఈ టైటిల్. ఇది ఓ పంజాబీ హిట్ మూవీకి రీమేక్ కావడం విశేషం. ‘దేనికైనా రెడీ’తో విష్ణు కెరీర్ ను గాడిన పెట్టిన నాగేశ్వరరెడ్డి మరోసారి అతడితో సినిమా చేస్తుండటంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ‘డైనమైట్’తో విష్ణు గట్టి ఎదురు దెబ్బ తినగా.. రాజ్ తరుణ్ కూడా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’తో కింద పడ్డాడు. వీళ్లిద్దరికీ ఇప్పుడు సక్సెస్ చాలా అవసరం. విష్ణు సరసన సోనారికా.. రాజ్ సరసన హెబ్బా పటేల్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Tags:    

Similar News