పటాస్ సినిమాతో డైరక్టర్ గా మారిన రైటర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు హీరోకు అంధత్వం ఉంటే అనే కాన్సెప్టుతో ''రాజా ది గ్రేట్'' అనే సినిమాతో దూసుకొస్తున్నాడు. మాస్ రాజా రవితేజ హీరోగా.. మెహ్రీన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు. పదండి ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
అవ్వడానికి హీరో అంధుడే కాని.. మనోడికి ప్రతీ చిన్న శబ్దం వినిపించేస్తుంది. అందుకే ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నాడో లేదో తెలియదు కాని.. హీరోమాత్రం తన సౌండ్ సెన్స్ తో కామెడీ.. యాక్షన్.. రొమాన్స్.. సెంటిమెంట్.. ఇలా అన్నీ పండించేస్తున్నాడు. రవితేజ చూడ్డానికి స్లిమ్ గా ఉన్నా కూడా.. ఎందుకో వయస్సు తెలిసిపోతోంది. ఇక మెహ్రీన్ బాగానే ఉంది. అయితే అనిల్ రావిపూడి తనకు అచ్చొచ్చిన కామెడీని సినిమాలో బాగానే దట్టించేశాడు.
హీరోకు అంధత్వం అనే పాయింట్ తీసేస్తే.. తక్కిన సినిమా అంతా యాజిటీజ్ ఊర మాస్ తెలుగు సినిమాయే. ఒక హీరో. ఒక హీరోయిన్. ఆమెను కాపాడగలిగేది ప్రపంచంలో ఆ హీరో ఒక్కడే. హీరో వేసే పంచులకు సపోర్టు పంచులు వేసే కమెడియన్. కొడుకునే వెనకేసుకొచ్చే తల్లి. బాగా రిచ్ విలన్. మధ్యలో బకరా ఫాదర్లు పోలీసులు. సేమ్ టు సేమ్.. బోలెడన్ని తెలుగు మసాలా కమర్షియల్ సినిమాల కథలు ఇవేగా!!
దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి.. ప్రొడక్షన్ అంతా చాలా రిచ్ గా ఉందిలే. మరి సినిమాలో పూర్తి స్థాయి కామెడీ ఉంటే ఈ రోజుల్లో డిజెలు మహానుభావుడులూ డబ్బులు బాగానే తెస్తున్నాయి కాబట్టి.. ఈ సినిమా కూడా దిల్ రాజుకు కాసుల పంట పండించేలానే ఉంది. ఇక ఆ 'హు హు హూ హూ' అనేదేంటో తెలియాలంటే ఓమారు ట్రైలర్ మీద ఒక లుక్కేసుకోండి. హు హు హూ హూ!!