వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందేనన్న ఆలియా

Update: 2020-08-06 23:30 GMT
రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తాడు. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం వల్ల విడుదల ఆలస్యం అవుతాయేమో కాని సినిమా రీ షూట్‌ చేయడం లేదంటే హీరో హీరోయిన్‌ కోసం వెయిట్‌ చేయడం వంటివి జరుగవు. కాని ఈసారి మాత్రం ఆయనకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. మల్టీస్టారర్‌ అవ్వడంతో పాటు బాలీవుడ్‌ హీరోయిన్‌ ను హీరోను నటింపజేయడం మరియు హాలీవుడ్‌ నటిని ఎన్టీఆర్‌ కు జోడీగా నటింపజేయాల్సి రావడంతో జక్కన్న నటీనటుల డేట్ల విషయంలో ఈసారి ఇబ్బంది పడుతున్నాడు.

కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టాలనుకున్నా హీరోలు మరియు హీరోయిన్స్‌ డేట్ల విషయంలో తేడా కొడుతోంది. వచ్చే ఏడాది వరకు డేట్లు ఇవ్వలేను అంటూ ఆలియా భట్‌ తేల్చి చెప్పిందట. ఈ ఏడాది చివర్లో సినిమాను పట్టాలెక్కించాలుకున్న జక్కన్నకు ఇద్దరు హీరోయిన్స్‌ తో కూడా సమస్యగా ఉంది. ఓవియా మరో దేశం నుండి రావాల్సి ఉంది. కనుక ఆమె రాకకు సమస్యగా ఉంది. ఇక ఆలియా కూడా 2021 వరకు కెమెరా ముందుకు రానంటూ తనకు తానుగా గిరి గీసుకుని ఉందట.

ఆలియా మరియు చరణ్‌ ల కాంబోలో కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. అలాగే సినిమాకు సంబంధించిన ఒక కీలక పాటను కూడా ఆమెపై చిత్రీకరించాల్సి ఉందట. దాంతో ఆమె వచ్చే వరకు షూటింగ్‌ ప్రారంభించడం కష్టమే అన్నట్లుగా జక్కన్న ఉన్నాడు. ఈ ఇబ్బందులల్లో షూటింగ్‌ మొదలు పెట్టే కంటే వచ్చే ఏడాది కరోనా అంతా కనుమరుగు అయిన తర్వాత షూటింగ్‌ మొదలు పెడితే బాగుంటుందనే అభిప్రాయానికి జక్కన్న వస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News