RRR లో రామరాజు పాత్రంటేనే రాజమౌళికి కాస్త ఎక్కువ ఇష్టమట..!

Update: 2022-01-25 10:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరల్ ప్రభావంతో వాయిదా పడింది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాని మార్చి 18న లేదా ఏప్రిల్ 28న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ ల పాత్రలతో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కల్పిత కథతో రూపొందించారు. చరిత్రలో కలిసారో లేదో తెలియని ఈ ఇద్దరు మహావీరుల మధ్య స్నేహాన్ని ప్రధానంగా చూపించబోతున్నట్లు మేకర్స్ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఇందులో రామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు.

అయితే అల్లూరి - కొమురం భీమ్ లలో ఏ పాత్రలలో రామరాజు పాత్రను కొంచెం ఎక్కువగా ఇష్టపడినట్లు రాజమౌళి ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాలో ఇద్దరి పాత్రలు సమానంగా ఉంటాయని.. రెండు పాత్రల్లో ఏది నచ్చిందో చెప్పడం చాలా కష్టమని జక్కన్న పేర్కొన్నారు. పర్సనల్ గా తాను భీమ్ కంటే రామ్ క్యారక్టర్ కాస్త ఎక్కువ ఆకర్షితుడైనట్లు వెల్లడించారు.

RRR ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి మాట్లాడిన ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై రామ్ చరణ్ అభిమానులు దర్శకుడిని ప్రశంసిస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఒక హీరో పట్ల రాజమౌళి పక్షపాతం చూపిస్తున్నాడని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది పక్కన పెడితే జక్కన్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఇద్దరు హీరోలను ఎలా బ్యాలన్స్ చేస్తారు..

రెండు పాత్రలకు ఎలా న్యాయం చేస్తారు? అనేది మొదటి నుంచీ అందరి మదిలో ఉన్న ప్రశ్న. సినిమాలో ఏ విషయంలో అయినా సమ ప్రాధాన్యత లేకపోతే మాత్రం ఓ వర్గం ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రాజమౌళి ఏ కంటెంట్ రిలీజ్ చేసినా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు ఈక్వల్ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. మాస్టర్ స్టోరీ టెల్లర్ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ చేయాలనుకున్నప్పుడు.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. అందుకే కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను.. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ని అలరించే విధంగా RRR చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్ది ఉంటారని భావించవచ్చు
Tags:    

Similar News