శ్రీసింహా విషయంలో నాకు కొంచెం టెన్షన్ గా ఉంది: రాజమౌళి

Update: 2021-03-21 15:52 GMT
కీరవాణి తనయుడు శ్రీసింహా 'మత్తువదలరా' సినిమా ద్వారా తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత సినిమాగా ఆయన 'తెల్లవారితే గురువారం' చేశాడు. మణికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీసింహా  సరసన నాయికలుగా చిత్ర శుక్లా .. మిషా నారంగ్ సందడి చేయనున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 27వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ముఖ్య అథితిగా ఈ సినిమా నిన్నరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.

ఈ వేడుకకు కీరవాణి కుటుంబ సభ్యులతో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులంతా కూడా హాజరయ్యారు. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ .. 'తెల్లవారితే గురువారం' టీజర్ చాలా బాగుంది .. ట్రైలర్ ఇంకా బాగుంది .. పాటలు కూడా ఎంతో బాగున్నాయి. వేరే వాళ్ల సినిమాలు చూసినప్పుడు ఇది చాలా బాగా చేశాడు .. అది సరిగ్గా చేయాలేదు అనేసి బ్రహ్మాండంగా చెప్పేస్తూ ఉంటాము. కానీ ఇంట్లో పిల్లల విషయమై చెప్పవలసి వస్తే చాలా టెన్షన్ గా ఉంటుంది. ఏ కొంచెం బాగా చేసినా అబ్బా మనవాడు ఇరగొట్టేశాడని చెప్పేసి మురిసిముక్కలై పోతుంటాము. మనపిల్లవాడు కాబట్టి అలా అనిపిస్తుందా? నిజంగానే బాగా చేశాడా? అనేది మాత్రం ఎప్పటికీ తెలియదు .. సినిమా చూశాక మీరే చెప్పాలి.

కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు .. ఆయన విషయంలో నాకు టెన్షన్ లేదు. మాస్ .. క్లాస్ అనే తేడా లేకుండా సాంగ్స్ ఇరగ్గొట్టేస్తున్నాడు. రీ రికార్డింగు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. చిన్నవాడు కాబట్టి శ్రీసింహా విషయంలో కొంచెం భయం .. మీరు ఆ భయాన్ని తొందరగా తీరుస్తారని ఆశిస్తున్నాను. చిన్న కామెడీ బిట్ ఏమిటంటే .. మా పెద్దన్నయ్య కీరవాణిని చూస్తే ఈ మధ్య బాగా నవ్వొస్తోంది. చాలామంది దర్శకులు ఆయనకి కాల్ చేసి, 'సార్ శ్రీసింహా హీరోగా ఒక కథ రెడీ చేసుకున్నాము .. మీరు ఒకసారి వింటారా" అని అడుగుతున్నారు. "నా సినిమా కథలే నేను వినను .. " అంటూ ఆయన ఇబ్బందిపడుతుండటం మా ఇంట్లో జరుగుతోన్న పెద్ద కామెడీ" అంటూ నవ్వేశారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, దర్శకుడిని అభినందించారు.
Tags:    

Similar News