డైరెక్టర్ కు ముందు అది ఉండాలి-రాజమౌళి

Update: 2015-07-29 14:26 GMT
‘‘నేను గొప్ప ఫిలిం మేకర్ ని కాదు.. కానీ మంచి స్టోరీ టెల్లర్’’.. ఇదీ దర్శక ధీరుడు రాజమౌళి చాలాసార్లు చెప్పిన మాట. నిజమే.. గొప్ప గొప్ప దర్శకుల్లా సినిమాను పొయెటిక్ వే లో తీయలేడు రాజమౌళి. కానీ సామాన్యమైన కథను కూడా చాలా ఎఫెక్టివ్ గా.. ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసేలా చెప్పగలగడం అతడికి బాగా అబ్బిన విద్య. ఈ విద్యతోనే వరుసగా పది హిట్లు కొట్టాడు జక్కన్న. ఆ హిట్లు కూడా మామూలువి కాదు.. ఒకదాన్ని మించిన సినిమా ఇంకోటి. తాజాగా బాహుబలి సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు రాజమౌళి. మరి ఆ స్థాయికి చేరుకున్న డైరెక్టర్.. వర్ధమాన దర్శకులకు ఏం సందేశమిస్తాడు? కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి ఏం సలహా ఇస్తాడు? ఆయన మాటల్లోనే విందాం పదండి.

‘‘కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లకు నేను ప్రధానంగా చెప్పేది ఒకటి. మీ మనసు మాట వినండి. మీకేది నచ్చితే అది చేయండి. దాని వల్ల ఫలితం పాజిటివ్ గా ఉండొచ్చు. లేదా నెగెటివ్ గా ఉండొచ్చు. ఫలితం తేడాగా వచ్చినా మీరు అనుకున్నది చేశారన్న సంతృప్తి ఉంటుంది. కానీ మీ మనసు చెప్పినట్లు వినకుండా ఇంకొకరి సలహాపై ఏదైనా చేసి అప్పుడు ఫలితం తేడా వస్తే మానసిక క్షోభ మామూలుగా ఉండదు. ఒకవేళ సక్సెస్ అయినా కూడా మనసుకు నచ్చినట్లు చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో అన్న ఆలోచన అలాగే ఉండిపోతుంది. కాబట్టి మీకు నచ్చిందేదో చేయండి. తర్వాత ఓ దర్శకుడికి అన్నిటికంటే ముఖ్యమైందిగా నేను భావించేది కామన్ సెన్స్. ఇది ఉన్న ఏ దర్శకుడైనా ప్రేక్షకులతో చాలా సులభంగా కనెక్ట్ అయిపోతాడు. ఆ సెన్స్ లేకుంటే ఎంత గొప్ప సినిమా తీసినా.. ప్రేక్షకులకు చేరువ కాలేడన్నది నా అభిప్రాయం’’ అని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పాడు.
Tags:    

Similar News