రాజమౌళి మాటే ప్రచార అస్త్రంగా.. 'బ్రహ్మాస్త్రం'!

Update: 2022-08-26 05:21 GMT
సినిమా ఏదైనా సరే.. సంచలన దర్శకుడు రాజమౌళి నోటి నుంచి ఏదైనా మాట వస్తే.. ఆ మూవీకి వాల్యూయాడ్ కావటం తెలిసిందే. తన ఛాయిస్ గురించి సోషల్ మీడియాలో చెప్పటం.. ఆ వెంటనే ఉత్సుకత పెరగటం చాలా సందర్భాల్లో చూసిందే.

పెద్దగా ప్రచారం లేని సినిమాల విషయంలోనే కాదు.. భారీ బడ్జెట్ తో నిర్మించి.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సినిమాలకు సైతం జక్కన్న నోటి మాటల్ని ప్రచార అస్త్రంగా వాడే తీరు చూస్తే.. ఆయన మాటకు ఉండే పవర్ ఏమిటన్నది అర్థం కాక మానదు.

దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన బ్రహ్మస్త్ర మొదటి భాగం శివను సెప్టెంబరు తొమ్మిదిన విడుదల చేస్తున్న వైనం తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్లకు పైనే ఈ సినిమా కోసం వర్కు చేశారు. ఈ సినిమాను అత్యుద్భత రీతిలో రెఢీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ వేగాన్ని తాజాగా పెంచారు. చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రచారానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళిని ప్రత్యేకంగా తీసుకొచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఈ మూవీ గురించి మాట్లాడిన ఆయన.. ఈ సినిమా మీద ప్రశంసల వర్షాన్ని కురిపించారు. చిన్నతనం నుంచి మనం చదువుకున్న.. ఊహించుకున్న అస్త్రాల గొప్పతనాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రపంచానికి అద్భుతంగా చూపించనున్నట్లుగా చెప్పారు. అందుకోసం అద్భుతమైన ప్రపంచాన్ని ఆయన క్రియేట్ చేశారన్నారు.

అస్త్రాల కథను వాణిజ్య కోణంలో చెప్పటం తనకు బాగా నచ్చినట్లుగా చెప్పిన రాజమౌళి.. బ్రహ్మస్త్ర మూవీతో భారతీయ సంస్క్రతి.. పురాణాల వైభవం ప్రపంచానికి మరింత గొప్పగా పరిచయం కానున్నట్లు చెప్పారు.

2014 నుంచి సాగుతున్న బ్రహ్మాస్త్ర సుదీర్ఘ జర్నీలో తనను భాగం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. మిగిలిన సంగతులు ఎన్ని ఉన్నా.. ఒక భారీ బడ్జెట్ మూవీకి రాజమౌళి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పరిస్థితి చూస్తే.. ఆయన మాటే అస్త్రమన్న విషయం స్పష్టమవుతుంది.
Tags:    

Similar News