కోర్టు ముందుకు ర‌జ‌నీ 'కాలా' సాక్ష్యాలు

Update: 2017-08-05 06:24 GMT
త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న చిత్రం కాలా. మాఫియా నేప‌థ్యంలో సాగుతుంద‌న్న ఈ చిత్రానికి సంబంధించిన  షూటింగ్  ఓప‌క్క వేగంగా సాగుతోంది. పా. రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న కాలా మీద ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర క‌థ‌ను కాపీ కొట్టిన‌ట్లుగా త‌మిళ రైట‌ర్ రాజ‌శేఖ‌ర్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

కాలా కథ త‌న‌ద‌ని.. తాను రిజిస్ట‌ర్ చేసిన కరికాల‌న్ లో కొన్ని మార్పులు చేసి.. కాలాను నిర్మిస్తున్న‌ట్లుగా రాజ‌శేఖ‌ర్ ఆరోపిస్తున్నారు. మ‌ద్రాస్ హైకోర్టులో ఇందుకు సంబంధించిన ఒక పిటీష‌న్‌ ను  కూడా దాఖ‌లు చేశారు. కొన్నేళ్ల క్రితం తాను ర‌జ‌నీకాంత్‌ ను క‌లిసి.. త‌న క‌థ‌ను వినిపించాన‌ని చెబుతున్నారు.

ఇన్నాళ్ల త‌ర్వాత త‌న క‌థ‌ను త‌స్క‌రించి.. చిన్న‌మార్పుల‌తో సినిమాను  నిర్మిస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ పిటీష‌న్‌ ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం ఈ ఉదంతంపై స్పందించాల్సిందిగా నిర్మాత ధ‌నుష్‌.. హీరో ర‌జ‌నీకాంత్‌.. ద‌ర్శ‌కుడు పా.రంజిత్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో థ‌నుష్ రియాక్ట్ అవుతూ.. ప్ర‌చారం కోస‌మే పిటీష‌న‌ర్ ఇలాంటి వ్యాజ్యం వేశాడే త‌ప్పించి.. అత‌డి ఆరోప‌ణ‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో కోర్టు స్పందించి.. త‌న స్క్రిప్ట్ ను త‌స్క‌రించార‌న్న ఆరోప‌ణ‌కు సంబంధించిన సాక్ష్యాన్ని కోర్టుకు స‌మ‌ర్పించాల్సిందిగా ఆదేశించింది. దీంతో..కోర్టు ఆదేశాల మేర‌కు.. త‌న స్క్రిప్ట్‌ కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించారు రాజ‌శేఖ‌ర్. అదే స‌మ‌యంలో తాను ఆరోపించిన‌ట్లుగా తాను ర‌జ‌నీని క‌లిసి క‌థ‌ను చెప్పిన దానికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని కూడా జ‌త చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ ఈ నెల 8న జ‌ర‌గ‌నుంది. రాజ‌శేఖ‌ర్ చేస్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని కోర్టు భావిస్తే మాత్రం ర‌జ‌నీ అండ్‌కోకు భారీ ఎదురుదెబ్బ త‌గ‌ల‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News