నో పాలిటిక్స్ అంటున్న నటకిరీటి

Update: 2018-02-12 06:44 GMT
40 ఏళ్ళ నట ప్రస్థానంలో కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న హీరో రాజేంద్ర ప్రసాద్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మహా బిజీగా ఉంటున్న రాజేంద్ర ప్రసాద్ ఈ క్యాటగిరీలో టాప్ లిస్టు లో ఉన్నారు. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ వస్తున్న వార్తల పట్ల ఆయనే స్వయంగా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన క్షీరపురి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న నట కిరీటి పొలిటికల్ ఎంట్రీ గురించి స్పష్టంగా తన వివరణ ఇచ్చారు.

రాజకీయాలు తను గిట్టవని, నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న తనకు అది ఇంకా కొనసాగడం పట్ల చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అసలు ఉద్దేశమే లేనప్పుడు పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్న రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. స్టార్ హీరోలకు ధీటుగా హాస్య చిత్రాలకు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేసిన ఘనత రాజేంద్ర ప్రసాద్ కు దక్కుతుంది. 80, 90 దశకాల్లో రాజేంద్రుడి కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఓ రేంజ్ లో సాగింది.

ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ తను భవిష్యత్తులో కూడా పొలిటికల్ ఎంట్రీ గురించి ఆలోచించనని కుండ బద్దలు కొట్టేసారు. తన స్నేహితులంతా ఈ పాటికే అందులో ఇమడలేక బయటికి వచ్చి తిరిగి సినిమాలు చేసుకుంటున్న తరుణంలో రాజేంద్రుడి నిర్ణయం ముమ్మాటికి సరైనదే అని చెప్పొచ్చు . టామీ సినిమాకు గాను నంది అవార్డు కూడా గెలుచుకున్న రాజేంద్ర ప్రసాద్ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అయినా కెరీర్ స్వింగ్ లో ఉన్నప్పుడు రాజేంద్రుడైనా రిస్క్ ఎందుకు చేస్తాడు.
Tags:    

Similar News