కాలా రిలీజ్ డే రజనీ ఏం చేయబోతున్నాడంటే..

Update: 2018-06-03 07:41 GMT
రెండేళ్ల విరామం తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ బాక్సాఫీస్ సందడికి మళ్లీ రంగం సిద్ధమైంది. ‘కబాలి’తో తీవ్రంగా నిరాశ పరిచిన ఆయన.. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు పా.రంజిత్‌ తో చేసిన ‘కాలా’తో పలకరించబోతున్నాడు. ‘కబాలి’కి కనిపించిన క్రేజ్ ఈ సినిమా విషయంలో లేదు. రిలీజ్ తర్వాత ఏమైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి. జూన్ 7న.. అంటే గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ రోజు రజనీ ఈ సినిమా రిలీజ్ సంగతేమీ పట్టించుకోకుండా.. తన కొత్త సినిమా పనిలో పడబోతున్నాడు. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రజినీ నటించబోయే కొత్త సినిమా జూన్ 7నే ప్రారంభోత్సవం జరుపుకోబోతుండటం విశేషం. చకచకా ఈ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నాడు రజనీ.

అందుకే సినిమా విషయంలో ఆలస్యం చేయట్లేదు. సన్ పిక్చర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. పేరున్న టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేయబోతున్నారు. సిమ్రాన్ ఇందులో రజనీకి జోడీగా నటిస్తుందట. ‘పిజ్జా’.. ‘జిగర్ తండా’.. ‘ఇరైవి’ లాంటి సెన్సేషనల్ సినిమాలతో దర్శకుడిగా గొప్ప పేరే సంపాదించాడు కార్తీక్. అతను తీసిన ‘జిగర్ తండా’ రజనీకి విపరీతంగా నచ్చేసింది. అందులో బాబీ సింహా చేసిన విలన్ పాత్రకు తననెందుకు కన్సిడర్ చేయలేదని కూడా అడిగాడు సూపర్ స్టార్. ఇప్పుడు కార్తీక్ దర్శకత్వంలో హీరోగానే నటించబోతున్నాడు. ఈ కాంబినేషన్ భలే ఎగ్జైటింగ్ గా అనిపిస్తుండటంతో సూపర్ సినిమాలకు టాటా చెప్పేముందు ఒక స్పెషల్ మూవీతో బలమైన ముద్ర వేసి వెళ్తాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.


Tags:    

Similar News