రజినీ అసలేం చెప్పదలుచుకున్నాడో..

Update: 2017-05-15 09:01 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయారంగేట్రం అంశం మరోసారి చర్చకు వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తన అభిమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రజినీకాంత్.. ప్రస్తుత రాజకీయాల గురించి.. తన రాజకీయ అరంగేట్రం గురించి మాట్లాడారు. కానీ ఆయనేం చెప్పదలుచుకున్నారన్నదే జనాలకు అర్థం కాలేదు. దేవుడు దలుచుకుంటే తాను రాజకీయాల్లోకి వస్తానని ఓసారి.. తాను రాజకీయాల్లోకి రాకపోతే అభిమానులు నిరాశ చెందుతారని మరోసారి.. తనకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని ఇంకోసారి.. ఇలా రకరకాలుగా మాట్లాడాడు రజినీ. మొత్తంగా రజినీ ప్రసంగం వింటే పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోవడం ఖాయం. ఇంతకీ ఫ్యాన్ మీట్లో రజినీ ఏమన్నాడంటే..

‘‘కొన్ని రకాల పరిస్థితుల వల్ల నేను కొన్నేళ్ల కిందట ఓ రాజకీయ పార్టీకి (డీఎంకేని ఉద్దేశించి) మద్దదతిచ్చాను. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచింది. ఐతే ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి నేను రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ పెరిగింది. అభిమానులు కూడా నన్ను రాజకీయాల్లోకి రమ్మని అడిగారు. ఐతే నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వదలుచుకున్నా. చాలామంది రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లో ఉంటున్నారు. రాజకీయాల్ని వ్యాపారంగా మార్చేశారు. నేను నా శరీరాన్ని ఆరోగ్యంగా.. మనసును సానుకూలంగా ఉంచుకోవాలని అనుకుంటున్నా. దేవుడే నా జీవితాన్ని నడిపిస్తాడు. ఆయన జనాల్ని అలరించమని చెబితే సినిమాల ద్వారా అలరిస్తూ వస్తున్నా. డబ్బు కంటే జనాల్ని అలరించడం.. వాళ్లను సంతోష పెట్టడం నాకెక్కువ ఇష్టం. నన్ను రాజకీయాల్లో చూడాలనుకున్నవాళ్లు.. నేను అలా చేయకపోతే నిరాశ చెందుతారు. ఐతే భవిష్యత్తులో దేవుడు నన్ను రాజకీయాల్లోకి నడిపిస్తే వెళ్తానేమో. కానీ ఇప్పటికైతే నాకు ఆ ఆలోచన లేదు. రాజకీయాల ద్వారా డబ్బులు
సంపాదించాలనుకునేవాళ్లు నాకు దూరంగా ఉండండి. ఇలాంటి వాళ్లను నేను దగ్గరికి రానివ్వను’’ అన్నాడు రజినీ.
Tags:    

Similar News