అక్కడ కూడా హోరా హోరీ

Update: 2019-01-05 01:30 GMT
సంక్రాంతికి టాలీవుడ్‌ లో సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలైనా విడుదలవుతాయి. ఈసారి సంక్రాంతికి మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ మూడు సినిమాలపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ - ‘వినయ విధేయ రామా’ నువ్వా నేనా అన్నట్లుగా ఢీ కొట్టబోతున్నాయి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్‌ ను అలరించేందుకు ‘ఎఫ్‌ 2’ చిత్రం ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో సంక్రాంతికి రిలీజ్‌ కాబోతుంది. ఈ మూడు సినిమాలతో పాటు రజినీకాంత్‌ ‘పేట’ మూవీ కూడా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి ఈ నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయబోతున్నాయి. ఇక తమిళ నాట కూడా ఈ సంక్రాంతికి హోరా హోరీగా పోటీ ఉంది.

తమిళ స్టార్‌ హీరోలైన రజినీకాంత్‌ - అజిత్‌ ల సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. కనీసం ఒక్కటి రెండు రోజులు కూడా తేడా లేకుండా రాబోతున్న నేపథ్యంలో అభిమానుల మద్య పెద్ద ఎత్తున పోటీ వాతావరణం నెలకొంది. రజినీకాంత్‌ ‘పెట్ట’ మూవీ భారీ ఎత్తున అంచనాల నడుమ విడుదలకు సిద్దం అయ్యింది. రజినీకాంత్‌ ఈ చిత్రంలో చాలా విభిన్నంగా కనిపించడంతో పాటు ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో తమిళ ఆడియన్స్‌ ముఖ్యంగా సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఉర్రూతలూగి పోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

ఇక సరైన హిట్‌ కోసం కొంత కాలంగా ఎదురు చూస్తున్న అజిత్‌ ఈసారి ఎలాగైనా ‘విశ్వాసం’ చిత్రంతో సక్సెస్‌ ను కొడతాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. గతంలో అజిత్‌ తో సూపర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దానికి తోడు నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటించడం సినిమాకు అదనపు ఆకర్షణగా చెబుతున్నారు. తమిళ ఇండస్ట్రీలో పొంగల్‌ విజేత ఎవరు అంటూ అప్పుడే చర్చ మొదలైంది. ఈ రెండు సినిమాలు కూడా భారీ ఓపెనింగ్స్‌ పై దృష్టి పెట్టాయి. పెట్టా మూవీ తెలుగులో విడుదల కాబోతుండగా విశ్వాసం మాత్రం కేవలం తమిళంలోనే విడుదల కాబోతుంది. మరి ఈ రెండు సినిమాల్లో పై చేయి సాధించేది ఏదో చూడాలి.



Tags:    

Similar News