రజనీ.. ఒక్క సీన్ కోసం ఏడు టేక్స్

Update: 2018-11-24 14:30 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఎప్పుడూ హీరోయిజమే ఆశిస్తాం. దాని గురించే డిస్కషన్లు పెడతాం. తెరపై ఆయన్నో సూపర్ హీరోలా చూస్తాం. కానీ స్వతహాగా రజనీ మంచి నటుడు అనే విషయం మరిచిపోతుంటాం. దీని గురించి డిస్కషనే ఉండదు. రజనీ మేనరిజమ్స్.. ఆయన చరిష్మా.. వీటి మాయలో పడి నటన గురించి ఎప్పుడూ ఆలోచించం. కానీ ఆ కోణంలో చూస్తే రజనీలో మంచి పెర్ఫామర్ కనిపిస్తాడు. నేను అంత మంచి నటుడినేమీ కాదని రజనీ అంటాడు కానీ.. నిజానికి ఆయన నట కౌశలాన్ని చూపించే సినిమాలు చాలానే ఉన్నాయి. సూపర్ స్టార్‌ తో పని చేసిన దర్శకుల్ని అడిగితే ఆ విషయం చెబుతారు. రజనీతో బ్లాక్ బస్టర్లు తీసి.. ఇప్పుడు ‘2.0’తో పలకరించబోతున్న శంకర్ సైతం ఈ మధ్య సూపర్ స్టార్ యాక్టింగ్ టాలెంట్ గురించి గొప్పగా మాట్లాడాడు.

కానీ రజనీ సైతం ఇప్పటికే ఒకటే మాట చెబుతున్నాడు. తాను గొప్ప నటుడినేమీ కాదంటున్నాడు. ‘2.0’లో ఒక సీన్ కోసం తాను ఏడు టేక్స్ తీసుకున్నానని.. ఒక దశలో తన నట సామర్థం మీద తనకే సందేహాలు కలిగాయని చెప్పాడు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు. ఓ సన్నివేశం కోసం ఏడు టేకులు తీసుకున్నా. ఆ సన్నివేశం నాపై నాకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది’’ అని రజనీ చెప్పాడు. నిజానికి తనకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ‘2.0’లో తాను నటించలేనని..  వేరెవరినైనా చూసుకోమని శంకర్‌ కు తాను ముందే చెప్పానని.. కానీ తనకు అనుకూలంగానే ఈ సినిమా షూటింగ్‌ ప్లాన్‌ చేస్తామని చెప్పి ఒప్పించారని రజనీ వెల్లడించాడు. తాను బాడీసూట్‌ లు వేసుకోవాల్సిన అవసరం లేదని కూడా శంకర్ చెప్పాడని.. కానీ సినిమాకు అవసరం అని భావించి తానే బలవంతం చేసి బాడీసూట్‌ లు వేసుకున్నట్లు రజనీ చెప్పాడు. ఇక ఈ సినిమాలో తొలిసారి అక్షయ్‌ గెటప్‌ చూసి తాను షాకైనట్లు సూపర్ స్టార్ వెల్లడించాడు.
Tags:    

Similar News