ఐఏఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్..?

Update: 2021-10-25 07:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' 'ఆచార్య' సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో అగ్ర దర్శకుడు శంకర్ తో చేస్తున్న #RC15 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ భారీ ప్రాజెక్ట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేయగా.. రెగ్యులర్ షూటింగ్ ను పూణేలో స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

#RC15 మేకర్స్ ఎలాంటి అప్డేట్ లేకుండా.. సైలెంట్ గా రామ్ చరణ్ - కియరా అద్వానీ ల మధ్య ఓ పాట చిత్రీకరణతో షూటింగ్ మొదలుపెట్టారు. శంకర్ శైలి మేకింగ్ లో రూపొందుతున్న ఈ లావిష్ సాంగ్ ఒక యూనిక్ కాన్సెప్ట్ తో రెడీ అవుతోందని తెలుస్తోంది. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో కాన్సెప్ట్ తో పాటుగా డ్యాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. మరో వారం రోజుల పాటు ఈ పాట షూట్ ఉంటుందని సమాచారం.

శంకర్-చరణ్ కాంబోలో సందేశాత్మక అంశాలతో కూడిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ రాబోతోందని మొదటి నుంచీ వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. RC15 అనౌన్స్ మెంట్ పోస్టర్ ద్వారా రామ్ చరణ్ ఇందులో ప్రభుత్వోద్యోగిగా కనిపిస్తారని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో చరణ్ ఈ సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. రాజకీయ నాయకుల వల్ల అస్తవ్యస్తమైన పొలిటికల్ సిస్టమ్ ని సరిచేసి నిజాయితీ గల అధికారిగా చెర్రీ పాత్ర ఉంటుందని చెప్పుకుంటున్నారు.

అయితే మెగా హీరోలకు సివిల్ సర్వీసు అధికారి పాత్రలు పెద్దగా కలిసి రావడం లేదన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీలో ఐఏఎస్ అధికారిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. అలానే 'కొండ పొలం' చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వాలని కృషి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించడానికి రెడీ అయ్యారు. మరి ఈ పాత్ర మెగా వారసుడికి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

కాగా, RC15 శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఆయన గత చిత్రాల తరహాలోనే సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ మూవీగా.. విజువల్ వండర్ గా తీర్చిదిద్దనున్నారు. కొంతకాలంగా సరైన సక్సెస్ లేని శంకర్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొడతారని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.

RC15 చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న మైలురాయి 50వ చిత్రం కావడంతో బడ్జెట్ కు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీని కోసం సుమారు 170 కోట్ల వరకు కేటాయించారని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే ఈ ప్రాజెక్ట్ ఎస్వీసీ సంస్థలో వచ్చే భారీ బడ్జెట్ సినిమా అవుతుంది.

భారీ తారాగణం - టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాలో భాగం కానున్నారు. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి - అనంత శ్రీరామ్ పాటలకు సాహిత్యం రాస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ పవర్ ఫుల్ సంభాషణలు అందిస్తున్నారు. పాపులర్ కెమెరా మెన్ తిరు ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. RC15 కు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి


Tags:    

Similar News