మెగాస్టార్ సినిమాకు రామ్ చరణ్ అడ్డు

Update: 2017-09-30 04:42 GMT
మెగాస్టార్ 151వ సినిమాగా సైరా... నరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథతో తీస్తున్న ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు. బాహుబలి తర్వాత మళ్లీ లార్జర్ దాన్ లైఫ్ తరహాలో ఈ మూవీ తీయబోతున్నారు. ఇప్పటికి 150 సినిమాలు పూర్తి చేసుకున్న చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.  

సైరా.. నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి స్టోరీ - స్క్రిప్ట్ ఫైనలైజ్ అయినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. అక్టోబరు నుంచి ప్రారంభించే అవకాశం ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చేనెలలోనూ ఈ సినిమా షూట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే తొలుత సైరా సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ ను తీసుకున్నారు. కానీ అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి రత్నవేలు వచ్చాడు. అయితే రత్నవేలు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ - సమంత జంటగా నటిస్తున్న రంగస్థలం-1985 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మరో నెలకు పైగానే ఉంటుందని టాక్. రంగస్థలం పూర్తయితే తప్ప రత్నవేలు సైరా కోసం కెమెరా భుజానికి ఎత్తుకునే అవకాశం ఉండదు. కాబట్టి అంతవరకు సైరా టీం ఎదురుచూడక తప్పదు.  

సైరా సినిమాను తెలుగుతో పాటు తమిళం - హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నాడు. అందుకే కాస్టింగ్ కూడా భారీగా తీసుకున్నారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి - కన్నడ స్టార్ హీరో సుదీప్ - బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి ఇందులో కీలకపాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ ను కూడా ఆయా రంగాల్లో బెస్ట్ అనేవారినే ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానుల్లో ఆసక్తి విపరీతంగా ఉన్నా వారు మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే..
Tags:    

Similar News