రంగస్థలం రచ్చ ఆ రోజే..

Update: 2017-12-22 04:43 GMT
‘రంగస్థలం’ సినిమా విషయంలో అభిమానులది సుదీర్ఘ నిరీక్షణ. ఈ సినిమా మొదలై దాదాపు ఏడాది కావస్తోంది. ముందు ఈ సినిమాను ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేస్తారన్నారు. కానీ తర్వాత షెడ్యూల్ సంక్రాంతికి మారింది. ఆపై వేసవికి వెళ్లిపోయింది. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించిన విశేషాల్లో ఒక్క ఫస్ట్ లుక్ మాత్రమే పంచుకున్నారు. రెండు వారాల కిందట వచ్చిన ఆ ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలు పెంచింది. ఇక టీజర్ ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. దీనికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం.

సంక్రాంతి కానుకగా ‘రంగస్థలం’ టీజర్ రిలీజవుతుందట. ఫస్ట్ లుక్ తరహాలోనే టీజర్లోనూ సుకుమార్ ముద్ర ఉంటుందని.. దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ‘రంగస్థలం’ మూడు దశాబ్దాల కిందటి కోస్తాంధ్రా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. అక్కడి పల్లెల్లో సంక్రాంతి పండగను గొప్పగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి ఫ్లేవర్ ఉండేలా.. ఈ టీజర్ ఉండేలా చూస్తారట. టీజర్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. రామ్ చరణ్.. సమంత.. ఆది పినిశెట్టి.. జగపతిబాబు.. అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ రిలీజ్ రోజే ప్రకటించిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
Tags:    

Similar News