చరణ్ లేకుండానే షెడ్యూల్ అయిపోయింది

Update: 2016-02-28 04:46 GMT
ఇంకా హీరో గారు సెట్లో అడుగుపెట్టనే లేదు. మేకప్ వెయ్యనే లేదు. ఒక్క సీన్లోనూ నటించనే లేదు. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ అంటున్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. రామ్ చరణ్ హీరోగా తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’ రీమేక్ ఇటీవలే లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. హీరో లేకుండానే ఓపెనింగ్ చేయడమే కాదు.. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టించేశాడు నిర్మాత అల్లు అరవింద్. చెల్లెలి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న చరణ్ మార్చి 14న షూటింగులో జాయిన్ కాబోతున్నాడు. ఐతే చరణ్ లేకుండానే ఆల్రెడీ ఒక షెడ్యూల్ అవగొట్టేశాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

విలన్ పాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామి కాంబినేషన్లో కొన్ని కీలక దృశ్యాలు తెరకెక్కించాడట. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. హీరో కాంబినేషన్లో కాకుండానే కొన్ని కీలక సన్నివేశాలు వస్తాయి. సురేందర్ ఆ సన్నివేశాలే చిత్రీకరించాడు తొలి షెడ్యూల్లో. ఓ పది రోజులు గ్యాప్ తీసుకుని మళ్లీ మార్చి 10న రెండో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. చరణ్ ఇంకో నాలుగు రోజులకు వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతాడు. మెగా పవర్ స్టార్ సరసన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇంకో ఆరు నెలల్లోనే సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేసేయాలన్నది ప్లాన్. ఆగస్టు రెండో వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. చరణ్, సురేందర్ ల గత సినిమాలు పెద్ద ఫ్లాపులైన నేపథ్యంలో ఈ సినిమాపై ఇద్దరూ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
Tags:    

Similar News