చాక్లెట్ బాయ్ లుక్ లోకి షిఫ్ట్ అయిన #RAPO...!

Update: 2020-04-25 11:50 GMT
రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో మంచి జోష్ మీదున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు రామ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు మాస్ చిత్రాలను టచ్ చేయని చాక్లెట్ బాయ్ రామ్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ లుక్‌ లో అదరగొట్టేశాడు. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన రామ్ పోతినేని వెంటనే క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఏప్రిల్‌ లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. వరుసగా చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న రామ్ ఈ రెండు సినిమాలతో అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో కనిపించాడు. ఇప్పటికే విడుదలైన 'రెడ్' టీజర్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అయితే ఇన్నాళ్లు గుబురు గడ్డంతో కనిపించిన రామ్ ఇప్పుడు ఒక్కసారిగా నున్నగా క్లీన్ షేవ్ చేసుకొని దర్శనమిచ్చాడు. రెండు సినిమాలలో మాస్ లుక్ లో కనిపించి బోర్ కొట్టిందో.. లేదా నెక్స్ట్ సినిమా కోసం లుక్ చేంజ్ చేసాడో.. లేదా సమ్మర్ కదా సౌకర్యంగా ఉంటుందని ఆ లుక్ లోకి మారాడో తెలియదు కానీ మళ్ళీ చాక్లెట్ బాయ్ లా మారిపోయాడు.

లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన రామ్ సోషల్ మీడియా మాధ్యమాలలో క్లీన్ షేవ్ తో చాక్లెట్ బాయ్ లా ఉన్న ఫోటో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోకి 'సూర్యుడు మిమ్మల్ని నవ్వనివ్వడు.. హ్యాపీ వీకెండ్' అంటూ కామెంట్ జత చేసాడు. ఈ ఫోటో చూసిన రామ్ లేడీ ఫ్యాన్స్ 'చాక్లెట్ బాయ్ రామ్.. ఏమున్నాడే..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు వరుస యాక్షన్ సినిమాలు చేసిన రామ్.. నెక్స్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే పలు స్టోరీలు విన్న రామ్ ఇంకా ఏదీ ఫైనలైజ్ చేయలేదు. ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్పెషలిస్ట్ మారుతితో రామ్ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే రామ్ నటించిన 'రెడ్' లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత విడుదల కానుంది. ఈ మధ్య రామ్ 'రెడ్' సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ లో రిలీజ్ చేస్తున్నారనే వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. కాగా 'రెడ్' సినిమాని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై 'స్రవంతి' రవికిషోర్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా తమిళ మూవీ 'తడమ్' సినిమా ఆధారంగా రూపొందింది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని పొందబోతుందో తెలియాలంటే రామ్ చెప్పినట్టు థియేటర్లలో రిలీజయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News