నాగార్జున ఇరుకున పడిపోయాడే.

Update: 2018-04-19 14:32 GMT
రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్త కాదు. ఆయన గతంలో అనేక అంశాలపై చాలా వివాదాస్పద.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఎంతోమందిని అదే పనిగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడు. కానీ తాజాగా శ్రీరెడ్డి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు మాత్రం అన్నింటికీ భిన్నమైనది. ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ జనాలు.. తెలుగు సినీ ప్రేక్షుకులందరూ వర్మను అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ సైతం ఆయన చేసిన పనిని సమర్థించడం లేదు. ఇన్నాళ్లూ వర్మ ఏం చేసినా ఏదో సరదాకి చేస్తున్నాడని అనుకున్నారు కానీ.. ఇప్పుడు మరీ ఇంత దిగజారి పోయి పవన్‌ను అలా తిట్టిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ‘జీఎస్టీ’పై వివాదం తలెత్తినపుడు కూడా వర్మను సమర్థించిన వాళ్లున్నారు కానీ.. తాజా వివాదంలో మాత్రం వర్మ వైపు ఎవ్వరూ లేరు.

అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ వర్మను నీచుడు.. నికృష్టుడు అన్నాడంటే.. అతడిని ఇండస్ట్రీ నుంచి తరిమెయ్యాలి అన్నాడంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో వర్మ సినీ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయన సినిమాలకు ఇక టాలీవుడ్ నుంచి ఎలాంటి సహకారం అందకపోవచ్చు. అంటే అధికారికంగా ఎవరూ ఆయన్ని నిషేధించరు కానీ.. అనధికార బహిష్కరణ మాత్రం ఖాయం. మీడియా.. అభిమానుల్లో కూడా ఇలాంటి అభిప్రాయమే ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వర్మ దర్శకత్వంలో నాగార్జున సినిమా చేయడం ఆయన దురదృష్టమనే చెప్పాలి. ఇప్పటికే ‘జీఎస్టీ’ గొడవ వల్ల ‘ఆఫీసర్’ సినిమాపై చాలా నెగెటివ్ ఎఫెక్ట్ పడింది. ఐతే మధ్యలో జనాలు ఆ గొడవ నుంచి బయటికి వచ్చేయడంతో పరిస్థితి కొంచెం మెరుగైంది. ఐతే తాజా వివాదం కచ్చితంగా ‘ఆఫీసర్‌’ చాలా ప్రతికూలంగా మారుతుందనడంలో సందేహం లేదు. అసలు ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా వర్మను విమర్శిస్తున్న నేపథ్యంలో నాగార్జున కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. త్వరలో ‘ఆఫీసర్’ ప్రమోషన్లు మొదలుపెట్టాల్సి ఉన్న నాగార్జునకు వర్మకు సంబంధించిన ప్రశ్నలు ఇబ్బందిగా పరిణమించవచ్చు. ఈ పరిస్థితుల్లో నాగ్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News