దాదాసాహెబ్ కే అమితాబ్ అవార్డ్ ఇవ్వాలి!-ఆర్జీవీ

Update: 2019-09-25 06:37 GMT
ఊరంద‌రిదీ ఒక‌దారి అయితే ఉలిపిరిక‌ట్ట‌ది ఇంకో దారి. అంద‌రూ వెళ్లే దారిలో వెళితే ఆర్జీవీ ఎందుక‌వుతాడు. ఇంకేదో అయ్యేవాడు. అందుకే ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ఫేడ‌వుట్ అయిపోయినా మీడియా మాత్రం ఇంకా నెత్తిన పెట్టుకుంటోంది. ఆయ‌న కూసింద‌ల్లా ఆయ‌న‌కు న‌చ్చిన‌ట్టే ప్ర‌చారం చేస్తోంది. ఫేడ‌వుట్ అయ్యాక కూడా మీడియాని కుక్క‌పిల్ల‌లా వెంట తిప్పుకుంటూ ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది.

నిన్న‌టికి నిన్న(మంగ‌ళ‌వారం) బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కి ప్ర‌తిష్ఠాత్మ‌క దాదా సాహెబ్ పుర‌స్కారాన్ని కేంద్ర సమాచార ప్ర‌సారాల శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ప్ర‌క‌టించ‌గానే.. సెల‌బ్రిటీ ప్ర‌పంచం మొత్తం శుభాకాంక్ష‌ల‌తో అమితాబ్ ని ముంచెత్తింది. ర‌జ‌నీ-చిరంజీవి-నాగార్జున‌-మోహ‌న్ లాల్- ప‌వ‌న్ క‌ల్యాణ్ -క‌ర‌ణ్ జోహార్ వీళ్లంతా తెగ పొగిడేశారు. వీళ్ల‌తో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ క‌మిటీ జూరీ మెంబ‌ర్ ఆశా బోస్లే కూడా ప్ర‌శంసించారు. అయితే ఇంత‌మంది ఇన్నిర‌కాలుగా పొగిడేస్తే ఆర్జీవీ మాత్రం పూర్తి రివ‌ర్సులో గ్రీట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆయ‌న ఉలిపిరి క‌ట్ట కామెంట్ అంతే వేగంగా వైర‌ల్ అవుతోంది.

ఆర్జీవీ తాజాగా ఇన్ స్టాగ్ర‌మ్ లో ఏమ‌ని స్పందించారంటే... ``దాదాసాహెబ్ ఫాల్కే రావ‌డంలో అంత గొప్పేంటి?  ఈ అవార్డుపై నాకు అంత‌గా ఐడియా లేదు. ఎందుకంటే అత‌డు తెర‌కెక్కించిన రాజా హ‌రిశ్చంద్ర చిత్రాన్ని పూర్తిగా ఒక్క‌సారి కూడా చూడ‌లేక‌పోయాను. ఇంకా చెప్పాలంటే ప‌ది నిమిషాలు కూడా చూడ‌లేక‌పోయాను. ప‌దే ప‌దే చూడాల‌ని ప్ర‌య‌త్నించాను. చాలా సినిమాలు ప‌దిసార్లు చూసిన సంద‌ర్భాలున్నాయి. కానీ రాజా హ‌రిశ్చంద్ర మాత్రం ఎన్నిసార్లు ప్ర‌య‌త్నించినా చూడ‌లేక‌పోయాను. ఒక‌వేళ దాదా సాహెబ్ నే పిలిచి అమితాబ్ బ‌చ్చ‌న్ పుర‌స్కారం ఇవ్వాల్సింది!`` అంటూ త‌న‌దైన శైలిలో రామూ వ్యంగ్యంగా రివ‌ర్స్ కౌంట‌ర్ వేశారు. అంటే ఇప్ప‌టివ‌ర‌కూ అమితాబ్ కి శుభాకాంక్ష‌లు చెప్పిన వాళ్లంతా పిచ్చివాళ్ల‌నేదే ఆర్జీవీ ఉద్ధేశ‌మా?


Tags:    

Similar News