వర్మ మళ్ళీ మళ్ళీ అదే తప్పు

Update: 2019-03-20 01:30 GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ అనుకున్నట్టే తేదీ మారింది. రేపు సెన్సార్ కు వెళ్లబోతోంది. ఎన్నికల కమీషన్ సూచనల మేరకు అధికారులు ఇచ్చే రిపోర్ట్ ని బట్టి 29కైనా వస్తుందా లేదా అనే విషయం తేలిపోతుంది. ఒకవేళ ఏదైనా ప్రతికూల నిర్ణయం వస్తే మాత్రం ఏప్రిల్ 11 తర్వాతే ప్లాన్ చేసుకోవాలి తప్ప వేరే దారి ఉండదు. అయితే వర్మ చాలా ధీమాగా ఉన్నాడు. 29 రావడం ఖాయమంటూ ప్రకటనలు కూడా గుప్పిస్తున్నాడు. ఇలా చేయడం వర్మకు కొత్తేమి కాదు.

తన నిర్మాణంలో వచ్చిన భైరవగీతను నాలుగు సార్లు తేదీలు మార్చి ప్రతిసారి మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఫ్రీ పబ్లిసిటీ చేయించుకున్నాడు. దానికి హైప్ లేదు కాబట్టి అవన్నీ చేయాల్సి వచ్చింది. కానీ వివాదాస్పద అంశాలతో కూడిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కు అంత అవసరం లేదు. అయినా కూడా వర్మ తన పాత పంధాలోనే తేదీలు మార్చుకుంటూ అదే పధ్ధతిలోనే వెళ్తున్నాడు

లక్ష్మీస్ ఎన్టీఆర్ ని టిడిపి వర్గాలు ఎన్నికల సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తారనేది అందరూ ఊహించిందే. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. అలాంటప్పుడు జాగ్రత్త వహించి నోటిఫికేషన్ కన్నా ముందు విడుదల చేసే ప్రయత్నం చేయలేదు. సరికదా ఇప్పుడు సెన్సార్ బోర్డు అని టిడిపి అని ఏవో కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ.

ఖచ్చితంగా మార్చ్ 29న వస్తేనే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పుడున్న బజ్ ని క్యాష్ చేసుకోగలదు. అలా కాకుండా ఎన్నికలు అయ్యాక అంటే మాత్రం వేడి చల్లారిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేపు సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ బిల్డప్ అంతా బాగానే ఉంది కానీ కంటెంట్ విషయంలో తేడా వస్తే ఎలా ఉంటుందో. అయినా అలా జరగడం వర్మకు ప్రేక్షకులకు ఇద్దరికీ అలవాటే కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ హిట్ అయితేనే ఆశ్చర్యపోవాలి
    

Tags:    

Similar News