టాలీవుడ్ కు వెండితెర ఉగ్ర‌వాదుల‌నందిస్తా

Update: 2018-05-27 11:45 GMT
త్వరలోనే ఫిలిం ఇన్ స్టిట్యూట్ ప్రారంభించ‌బోతున్న‌ట్టు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ త‌న విల‌క్ష‌ణ‌త‌ను ఏమాత్రం కోల్పోకుండా త‌న స్కూల్ కు `ఆర్జీవీ అన్ స్కూల్ ` అని పేరు పెట్ట‌బోతోన్న విష‌యం విదిత‌మే. న్యూయార్క్ కు చెందిన డాక్టర్ శ్వేతా రెడ్డి.. రామ్ స్వరూప్ లతో కలిసి ఈ స్కూల్ ను లాంచ్ చేయ‌బోతున్నాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించారు. వ‌ర్మ వంటి వ్య‌క్తి నేతృత్వంలో లాంచ్ కాబోతోన్న ఆ `అన్ స్కూల్ `లో ఏం నేర్ప‌బోతున్నార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ ఏర్ప‌డింది. ఆ ఊహాగానాల‌కు తెర‌దించుతూ వ‌ర్మ త‌న స్కూల్ గురించి షాకింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వ‌ర్మ  ‘ఆర్జీవీ అన్‌ స్కూల్‌’ పేరుతో ఫిలిం స్కూల్‌ ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న‌లాగే మ‌రి కొంత మంది వెండితెర ఉగ్ర‌వాదుల‌ను త‌యారు చేసేందుకు ఈ స్కూల్ పెట్ట‌బోతున్న‌ట్లు వ‌ర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మీడియాతో మాట్లాడిన వర్మ ఆ స్కూల్ గురించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

`శివ` సినిమాతో టాలీవుడ్ లో వ‌ర్మ స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో స‌రికొత్త ట్రెండ్ సృష్టించేందుకే తాను ` `ఆర్జీవీ అన్‌స్కూల్ ` పెట్ట‌బోతున్నాన‌ని వ‌ర్మ అన్నారు. ఆ స్కూల్ ద్వారా సినిమాల‌లో ఓనమాలు కూడా తెలియని వారిని ప్రొఫెష‌న‌ల్స్ గా త‌యారు చేస్తాన‌ని వ‌ర్మ అన్నారు. త‌న స్కూల్ లో చేరే యువతీ యువకుల అభిరుచిని బట్టి కోర్సులను అందిస్తామ‌న్నారు. 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన విభాగాల్లో శిక్షణనిస్తామ‌న్నారు. త‌మ స్కూళ్లో అడ్మిష‌న్ పొందాలంటే `7` ప్రశ్నలకు సమాధాన‌మివ్వాల‌ని కండిష‌న్ పెట్టారు. త‌న లాంటి వెండితెర ఉగ్రవాదులను తయారు చేసి పరిశ్రమ మీద‌కు పంప‌డ‌మే త‌న లక్ష్యమ‌న్నారు. అయితే, వ‌ర్మ చ‌ర్య‌లు ఊహాతీతం అని అంద‌రికీ తెలిసిందే. హ‌ఠాత్తుగా ఓ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవ‌డం...ఇక‌పై ఆ ప‌ని చేయ‌బోన‌ని ఒట్టు వేయ‌డం....రోజులు గ‌డ‌వ‌క ముందే ఒట్టు తీసి గ‌ట్టున పెట్టి మ‌ళ్లీ య‌థా ప్ర‌కారం త‌నకు న‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తాన‌ని నిస్సందేహంగా ప్ర‌క‌టించ‌డం వ‌ర్మే చెల్లుతుంది. మ‌రి, ఈ స్కూల్ వ్య‌వ‌హారం కూడా కొద్ది రోజుల త‌ర్వాత అట‌కెక్కుతుందో...లేక ప‌ట్టాలెక్కుతుందో కాల‌మే స‌మాధాన‌మివ్వాలి.
Tags:    

Similar News