ఈసారి మాత్రం గురి తప్పదుగా చరణ్..!

Update: 2022-06-16 04:13 GMT
'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూపించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాడు. నార్త్ ఆడియన్స్ అల్లూరిని రాముడిగా ఓన్ చేసుకోవడంతో.. చరణ్ కు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు మెగా వారసుడు హిందీ మార్కెట్ మీద దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

దాదాపు దశాబ్దం కిందట 'తుఫాన్'(జంజీర్) అనే సినిమాతో రామ్ చరణ్ నేరుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. జంజీర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అంతేకాదు బాలీవుడ్ క్రిటిక్స్ చేత వుడెన్ ఫేస్ యాక్టర్ అని ట్రోల్స్ ఎదుర్కొన్నాడు చరణ్. అయితే RRR చిత్రంలో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ తో అప్పుడు విమర్శించిన నోళ్ళతోనే ఇప్పుడు శభాష్ అనిపించుకున్నాడు. ఇదే కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు స్ట్రెయిట్ హిందీ సినిమా చేయడానికి చెర్రీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన రామ్ చరణ్.. ఇకపై ఆ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేయనున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న RC15 ను తెలుగుతో పాటుగా పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. దీని తర్వాత పాన్ ఇండియా లక్ష్యంగానే గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ సినిమా సెట్ చేసుకున్నారు.

ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ కు హిందీ సినిమాల ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆయితే మెగా పవర్ స్టార్ ఇంతవరకు ఏ సినిమాకూ సైన్ చేయలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తనయుడుని మళ్లీ బాలీవుడ్ లో రీలాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సపోర్ట్ తో చెర్రీ కొత్త మార్కెట్ కోసం డైరెక్ట్ హిందీ సినిమా తీయాలనుకుంటున్నారట. 'జంజీర్' వంటి రీమేక్ సినిమాతో దెబ్బతినడంతో ఈసారి మాత్రం ఒరిజినల్ స్టోరీతో బాలీవుడ్ సర్క్యూట్ లో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారట. దీని కోసం ఇప్పటికే సరైన దర్శకుడి వేట మొదలైందని అనుకుంటున్నారు.

ఇప్పుడున్న హీరోలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' అనే స్ట్రెయిట్ హిందీ మూవీ చేస్తున్నారు. ఇటీవల అడివి శేష్ 'మేజర్' చిత్రాన్ని ఏకకాలంలో తెలుగుతో పాటుగా హిందీలో తీసి సక్సెస్ అయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. అక్కినేని నాగచైతన్య వంటి పలువురు హీరోలు అతిథి పాత్రలతో హిందీలో మెరవబోతున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ పదేళ్ల తర్వాత నేరుగా హిందీ సినిమా చేసి సత్తా చాటుతారేమో చూడాలి.
Tags:    

Similar News