రానా 'ది యూనివ‌ర్శ‌ల్ హీరో'

Update: 2018-11-23 06:03 GMT
`బాహుబ‌లి` సిరీస్ త‌ర్వాత అన్ని ఇండ‌స్ట్రీల్ని ఊపేస్తున్న ఒకే ఒక్క ఎలిమెంట్ -క‌థ‌ల్లో యూనివ‌ర్శ‌ల్ అప్పీల్. సినిమా ఏదైనా.. క‌థ క‌చ్ఛితంగా అది ఇంట‌ర్నేష‌న‌ల్ ఆడియెన్‌ ని టార్గెట్ చేసేది అయ్యి ఉండాలి. రొటీన్ - రెగ్యుల‌ర్ మాస్ మ‌సాలా క‌మ‌ర్షియ‌ల్ ప్రాంతీయ‌ సినిమా అయ్యి ఉండ‌కూడ‌ద‌న్న మార్పు కొట్టొచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. మారిన ట్రెండ్‌ లో జ‌నం కొత్త పంథా క‌థ‌ల‌కు ప‌ట్టంగ‌డుతున్నారు. ముఖ్యంగా విజువ‌ల్ బ్యూటీ ఉన్న విశ్వ‌జ‌నీన‌ క‌థాంశాల‌కు ఎంతో ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. లోక‌ల్ సినిమాల‌తో పోటీప‌డుతూ హాలీవుడ్ సినిమాలు సాధిస్తున్న వ‌సూళ్లే అందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. ఇదేమీ ఒక్క‌రోజులో వ‌చ్చిన మార్పేమీ కాదు. జ‌నాల్లో అవేర్‌ నెస్‌ తో పాటు వ‌చ్చిన మార్పు. రెగ్యుల‌ర్ బాతాఖానీ క‌థ‌ల‌కు చెల్లుచీటీ ఇచ్చేశార‌న‌డానికి ఇదో సంకేతం.

స‌రిగ్గా ఇదే పాయింట్‌ ని అడాప్ట్ చేసుకుని త‌న‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ హీరోగా ఎలివేట్ చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  ఒకే దెబ్బ‌కు ప‌ది పిట్ట‌లు అన్న చందంగా స‌రైన టైమ్‌లో సిస‌లైన ప్లానింగ్‌ తో దూసుకొస్తున్న ఆ హీరో ఎవ‌రో కాదు.. మ‌న రానా అలియాస్ భ‌ళ్లాల దేవ‌. బాహుబ‌లి విల‌న్ భ‌ళ్లాలుడిగా అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపులారిటీ వ‌చ్చింది. ఆ టైమ్‌లోనే `ఘాజీ` లాంటి వైవిధ్య‌మైన సినిమాతో మ‌రింత పాపుల‌ర‌య్యాడు. ఇక ప్ర‌స్తుతం  అత‌డు ఆడుతున్న‌దంతా కొత్త ఆట‌. ఈ న్యూ గేమ్ పూర్తిగా మైండ్ గేమ్‌ గా మారింది. రానా ఇప్ప‌టికిప్పుడు పూర్తి యూనివ‌ర్శ‌ల్ థీమ్ ఉన్న కంటెంట్‌ తో మూడు-నాలుగు సినిమాల‌కు స్కెచ్ వేశాడు. ఇవ‌న్నీ అత్యంత భారీ బ‌డ్జెట్ల‌తో ఎవ‌రూ ఊహించ‌నంత పెద్ద కాన్వాసుతో తెర‌కెక్కుతున్నాయి. ఇందులో `జంగిల్ బుక్` త‌ర‌హా చిత్రాలు మునుముందు రానా నుంచి చూడ‌బోతున్నాం. రానా స్వ‌త‌హాగా అమ‌ర్ చిత్ర‌క‌థ కామిక్స్ కి వీరాభిమాని. చిన్న‌ప్ప‌టి నుంచి అవి చూస్తూ పెరిగాడు. అందువ‌ల్ల అలాంటి క‌థ‌ల్లో న‌టించాల‌ని క‌ల‌గంటున్నాడు. ఆ సంగ‌తిని ఇటీవ‌లే రానా డాడ్ - అగ్ర‌నిర్మాత డి.సురేష్ బాబు సైతం చెప్పారు. యానిమేష‌న్స్ - విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో రూపొందిస్తున్న సినిమాల‌కు అంత‌కంత‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న వేళ రానాని మునుముందు 3డి అమ‌ర్ చిత్ర‌క‌థ హీరోగా చూసే వీలుంది. ప్ర‌స్తుతం అవ‌స‌ర‌మైన టెక్నాల‌జీ మాష్టార్ల‌ను డి.సురేష్ బాబు బృందం త‌యారు చేస్తోంది. అందుకోసం ఏకంగా ఇటు హైద‌రాబాద్‌, అటు అమెరికాలోనూ కొన్ని టీమ్‌ లు ప‌ని చేస్తున్నాయి. వీళ్లంద‌రి ల‌క్ష్యం హైద‌రాబాద్‌ ని మ‌రో హాలీవుడ్‌ గా మార్చేయ‌డ‌మే. ఆ స్థాయి క‌థ‌ల్ని - సాంకేతిక‌త‌ను అడాప్ట్ చేసుకుని మ‌న ప‌రిశ్ర‌మ‌ను మ‌రో లెవ‌ల్లో చూపించాల‌న్న త‌ప‌న‌తో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఈ ప్ర‌య‌త్నాల‌కు అగ్గి రాజేస్తూ త్వ‌ర‌లో రాబోతున్న మోగ్లీ, ది ల‌య‌న్ కింగ్ చిత్రాల విజువ‌ల్స్ మ‌న మేక‌ర్స్‌ లో స్ఫూర్తిని ర‌గిలిస్తున్నాయి.

రానాకి ఇక మూడ్ రావ‌డం ఖాయం. మోగ్లీ, ది ల‌య‌న్ కింగ్ చిత్రాలు ఇండియ‌న్ బాక్సాఫీస్‌ ని ఓ ఊపు ఊపేయ‌డం ఎంత ఖాయ‌మో.. రానాకి మూడ్ రావ‌డం కూడా అంతే గ్యారెంటీ. అత‌డు ఇప్ప‌టికే ఓవైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించ‌డం ఆల్మోస్ట్ త‌గ్గించేశాడు. బాలీవుడ్‌ లో అనుకోకుండా వ‌చ్చిన ఆఫ‌ర్ `హౌస్‌ ఫుల్ 4` త‌ప్ప ఇంకేదీ రొటీన్ ప్ర‌య‌త్నం లేనేలేదు. ఇప్ప‌టికే `హాథీ మేరా సాథీ` లాంటి బ‌హుభాషా చిత్రంలో న‌టిస్తూ వేడి పెంచుతున్నాడు. ఇది అన్ని భాష‌ల్లో రిలీజయ్యే వీఎఫ్ ఎక్స్ బేస్డ్ సినిమా. చుట్టూ కొండ‌లు.. ప‌చ్చ‌ద‌నం..అడివి.. ఏనుగులు.. ఆ మ‌ధ్య‌లో రానా .. ఈ సినిమా ఉద్ధేశం యూనివ‌ర్శ‌ల్ థీమ్. హాలీవుడ్ ఆడియెన్‌ కి క‌నెక్ట‌య్యే ఉద్ధేశ‌మే ఇది. ఆ త‌ర్వాత రానా న‌టించ‌బోయేది అదే త‌ర‌హా వీఎఫ్ ఎక్స్ బేస్డ్ సినిమానే. అది `హిర‌ణ్య‌క‌సిప‌` అవుతుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ అవుతోంది. ఆ క్రమంలోనే రానా `ది జంగిల్ బుక్` త‌ర‌హాలో గ్రాఫిక్స్ బేస్డ్ కంటెంట్‌ తో `అమ‌ర్‌ చిత్ర‌క‌థ‌` త‌ర‌హా సినిమా చేసే వీలుంద‌ని సంకేతాలు అందాయి. ఓ ర‌కంగా ప్ర‌స్తుతం `సాహో` లాంటి భారీ ప్రాజెక్టుతో ఫ్రెండు ప్ర‌భాస్ నెక్ట్స్ లెవ‌ల్‌ ని ఎలా ఆశిస్తున్నాడో ఇంచుమించు అంత‌కుమించిన ప్లాన్స్‌ తో రానా దూసుకెళుతున్నాడ‌ని ఈ స‌న్నివేశం ప‌క్కాగా చెబుతోంది.
   

Tags:    

Similar News