రానా సిగరెట్ ఎందుకు మానేశాడంటే..

Update: 2017-07-30 06:42 GMT
సినిమా వాళ్లంటే చాలు.. చెడ్డ అలవాట్లు ఎక్కువుంటాయని జనాల నమ్మకం. అందుకే ఇప్పుడు వాళ్ల మీద డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు వస్తుంటే జనాలు కొట్టిపారేయట్లేదు. సినిమా వాళ్లంటే దురలవాట్లు గ్యారెంటీ అన్న అభిప్రాయం ఆ రకంగా జనాల్లో బలపడిపోయింది. ఐతే సినిమా వాళ్ల గురించి మరీ అంత తప్పుగా ఆలోచించొద్దని అంటున్నాడు దగ్గుబాటి రానా. తన మీద కూడా డ్రగ్స్ ఆరోపణలు ఇంతకుముందూ వచ్చాయని.. ఇప్పుడూ వచ్చాయని.. ఐతే తాను ఎప్పుడూ వాటి జోలికి వెళ్లలేదని రానా తెలిపాడు. తనకు సిగరెట్ అలవాటు మాత్రం ఉండేదని.. దాన్ని కూడా కొంత కాలం కిందటే వదిలేశానని రానా తెలిపాడు. అసలు తనకు సిగరెట్ ఎలా అలవాటైందో.. దాన్ని ఎందుకు వదిలేశానో ఒక ఇంటర్వ్యూలో అతను వివరించాడు.

‘‘నేను సిగరెట్ సినిమా కోసమే అలవాటు చేసుకున్నా. సినిమా కోసమే వదిలేశా. ‘లీడర్‌’ సినిమా టైంలో నాకు సిగరెట్ అలవాటైంది. ఆ సినిమాలో హీరో సిగరెట్‌ తాగే సీన్లున్నాయి. అందుకోసం మొదలుపెడితే.. అది అలవాటుగా మారింది. చాలాసార్లు మానాలనుకున్నా. కానీ సీరియస్‌ గా తీసుకోలేదు. ఐతే ఇప్పుడది నా ప్రొఫెషన్ కే సమస్య అయ్యింది. ఈ మధ్య ‘నేనే రాజు నేనే మంత్రి’కి డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు వాయిస్‌ లో తేడా వచ్చింది. దగ్గు రావడంతో ఇబ్బంది పడ్డాను. మామూలుగా నేను డబ్బింగ్‌ చాలా బాగా చెబుతా. కానీ ఈ మధ్య తేడా వచ్చింది. వంద శాతం వాయిస్‌ రాలేదు. దీంతో డాక్టర్‌ దగ్గరికి వెళ్లాను. ఆయన సిగరెట్‌ తాగుతారా అని అడిగి.. వెంటనే మానేయమన్నారు. అంతే.. మానేశాను. నాకున్న ఒకే ఒక్క చెడ్డ అలవాటది. నా వృత్తికి అడ్డొస్తోందని దాన్ని మానేశాను’’ అని రానా తెలిపాడు.
Tags:    

Similar News