చెన్నైలో చిట్టిబాబు హవాకు బ్రేక్

Update: 2018-04-07 06:19 GMT
రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రకు సౌండ్ వినపడదు కాని అతని కలెక్షన్ల శబ్దం మాత్రం గూబ గుయ్యిమనేలా బాక్స్ ఆఫీస్ కు వినిపిస్తోంది. సుకుమార్ కెరీర్ లోనే కాదు రామ్ చరణ్ కు సైతం బెస్ట్ ఫిగర్స్ ఇస్తున్న రంగస్థలం ఇక్కడే కాదు కర్ణాటక-తమిళనాడులో కూడా వీరంగం ఆడుతోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో సమ్మె కొనసాగుతున్నందున అక్కడ తమిళ సినిమాలు విడుదల కావడం లేదు. ఇదే అదునుగా హింది సహా పరబాష చిత్రాలు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఇక అరవ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే రంగస్థలం లాంటి సినిమా వస్తే ఇక చెప్పేదేముంటుంది. అదే జరుగుతోంది. ఇప్పటి దాక ఒక్క చెన్నై నగరంలోనే రంగస్థలం కోటి రూపాయలు వసూలు చేసి బాహుబలి 2 తర్వాత అంత మొత్తం సాధించిన నాన్ తమిళ్ మూవీగా కొత్త రికార్డు సెట్ చేసింది.

ఇక్కడ మరో విశేషం ఉంది. బాహుబలి 2 తమిళ్ డబ్బింగ్ కూడా విడుదల అయ్యింది. కాని రంగస్థలం మాత్రం స్ట్రెయిట్ గా తెలుగు వెర్షన్ మాత్రమే విడుదల చేసారు. ఆ రకంగా చూసుకుంటే కేవలం తెలుగు ప్రింట్ మీద చెన్నైలో కోటి వసూలు చేసిన సినిమాగా రంగస్థలందే ఫస్ట్ ప్లేస్ అవుతుంది. తమిళ సినిమాలు లేక కరువులో ఉన్న అక్కడి ప్రేక్షకులకు పూర్తి గ్రామీణ నేపధ్యంలో ఉన్న రంగస్థలం బ్రహ్మాండంగా కనెక్ట్ అయ్యిందని వసూళ్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకవేళ సమ్మె లేక డబ్బింగ్ రూపంలో వచ్చుంటే ఇప్పుడు వచ్చిన దాని కంటే కనీసం 50 శాతం ఎక్కువ వచ్చేదని అక్కడ ట్రేడ్ మాట

కాని ఈ సంతోషం ఎక్కువ నిలిచేలా లేదు. కారణం రేపటి నుంచి సమ్మెకు మద్దతుగా తెలుగు సినిమాల విడుదల కూడా ఆపేస్తున్నారు. ఇప్పటికే ప్రదర్శనలో ఉన్న రంగస్థలం - చల్ మోహనరంగా కుడా ఆగిపోతాయి. మంచి రికార్డు దిశగా దూసుకుపోతున్న ఈ రెండు సినిమాలకు ఇది ఆశనిపాతమే. కాని డిమాండ్ల సాధనకు తీవ్రంగా పోరాడుతున్న తమిళ్ నిర్మాతలకు మద్దతుగా మనవాళ్ళే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 20లోపు సమ్మె ఆగకపోతే భరత్ అనే నేను తమిళనాడులో విడుదల కాదు.
Tags:    

Similar News