బాలీవుడ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ - స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొద్ది రోజుల క్రితం 52 వ పడిలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ వయసులో కూడా ఫిట్ నెస్ ను మెయింటెన్ చేస్తున్న సల్లూ భాయ్ కు ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువ. సల్మాన్ ఊ అనాలేగాని పెళ్లిచేసుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అయితే, సల్లూ భాయ్ మాత్రం ఇప్పటివరకు చాలామంది మోడల్స్ - బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమవ్యవహారాలు నడిపినా అవి పెళ్లి వరకు వెళ్లలేదు. దీంతో, ప్రస్తుతానికి సల్లూ భాయ్ బ్యాచ్ లర్ గానే మిగిలిపోయాడు. సల్మాన్ ఎక్కడకు వెళ్లినా అతడికి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. దానికి సల్మాన్ కూడా సరదాగా సమాధానమిస్తాడు. తాను పెళ్లి చేసుకోవడం వల్ల జనాలకు కలిగే ప్రయోజనం ఏంటో తనకు అంతుచిక్కడం లేదని, తనకన్నా జనాలకు తన పెళ్లిపై ఆసక్తి ఎక్కువని సల్మాన్ చెబుతుంటాడు. తాజాగా, సల్మాన్ పెళ్లి గురించి బాలీవుడ్ హీరోయిన్ - అతడి స్నేహితురాలు రాణి ముఖర్జీ షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకోకుండానే సరోగసీ ద్వారా తండ్రి కావాలని సల్మాన్ కు ఓ అమూల్యమైన సలహా ఇచ్చింది. తాను నటించిన 'హిచ్కి' ప్రమోషన్ కోసం బిగ్ బాస్-11కు వచ్చిన సందర్భంగా రాణి ముఖర్జీ ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది.
తమ లాగే తన కుమార్తె అదిరా - సల్మాన్ బిడ్డ మంచి స్నేహితులవుతారని రాణి తెలిపింది. సల్మాన్ బేబీ కూడా అతడిలాగే అందంగా ఉంటుందన్న రాణి మాటలకు సల్లూ భాయ్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఒకవేళ తన బిడ్డ తనలా కాకుండా తన తల్లిలా అందంగా పుట్టకుంటే పరిస్థితి ఏంటని సల్లూ భాయ్ అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు. నటి సుష్మితా సేన్ ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకోగా, తుషార్ కపూర్ ఐవీఎఫ్ ద్వారా, కరణ్ జొహార్, షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, ఫరాఖాన్ సరోగసీ విధానం ద్వారా బిడ్డలను పొందిన విషయం తెలిసిందే. అదే తరహాలో సల్మాన్ కూడా తండ్రి కావాలనేది రాణి కోరిక కాబోలు. గతంలో సల్మాన్ కూడా సరోగసీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను మంచి భర్తను కాకపోయినా, మంచి తండ్రిని కాగలనని, తాను హజ్బంగ్ మెటీరియల్ కాదని....ఫాదర్ మెటీరియల్ అని సల్మాన్ గతంలో అన్నాడు. సల్మాన్ కు పిల్లలు పుట్టాలని ఆయన తల్లి సల్మా ఖాన్ కోరుకునేదని కూడా చెప్పాడు. ఒకవేళ రాణి సలహాను సల్మాన్ పాటిస్తే.....ఖాన్ త్రయం.... సరోగసీ తండ్రులయినట్లుంది.